బాలయ్య కొత్త సినిమా 'పైసా వసూల్'కి ప్రీ రిలీజ్ బిజినెస్ బాగా జరుగుతోందట. బాలయ్య కెరీర్‌లోనే ఏ సినిమాకీ జరగనంత రేంజ్‌లో ఈ సినిమాకి బిజినెస్ జరుగుతోందని ప్రచారం జరుగుతోంది. ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ విన్నా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ గురించే మాట్లాడుకుంటున్నారు. 'గౌతమీ పుత్ర శాతకర్ణి' వంటి సూపర్ హిట్ తర్వాత బాలయ్య నుండి వస్తోన్న సినిమా ఇది. అంతేకాదు బాలయ్యకి 101వ సినిమా కూడా. పూరీ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న సినిమా కావండంతో మరిన్ని అంచనాలున్నాయి. చాలా నమ్మకంగా, ప్రతిష్ఠాత్మకంగా భావించి పూరీ తెరకెక్కిస్తున్న సినిమా 'పైసా వసూల్'. ఈ సినిమాకి ఆ టైటిల్ పెట్టాడంటేనే పూరీ కాన్ఫిడెన్స్ ఏ రేంజ్‌లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. పూరి సినిమాల్లో హీరోకి డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. సీనియర్ హీరో బాలకృష్ణ సైతం, పూరి మార్క్ హీరోయిజంలో చక్కగా ఒదిగిపోయాడట. శ్రియ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ముస్కాన్ మరో హీరోయిన్‌గా నటిస్తోంది. కైరా దత్ ఐటమ్ సాంగ్ సినిమాకి ప్రధాన ఆకర్షణ కానుందట. కాగా నిర్మాణ బాధ్యతలన్నీ, ముద్దుగుమ్మ ఛార్మి దగ్గరుండి చూసుకుంటోంది. లొకేషన్స్ పరంగా ఈ సినిమాని చాలా రిచ్‌గా తెరకెక్కించారట. బాలయ్యని ఇంతకుముందెన్నడూ చూడని విధంగా చూపించబోతున్నాడు పూరీ ఈ సినిమాలో. యాక్షన్ సీక్వెన్స్‌ని పవర్‌ఫుల్‌గా తెరకెక్కించారట. అలాగే అన్ని మాస్, కమర్షియల్ ఎలిమెంట్స్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడట పూరీ. విజయదశమి కానుకగా సెప్టెంబర్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.