1984లో నారా చంద్రబాబునాయుడు ఎలా వుండేవారో ఇప్పుడు చాలామందికి తెలియదు. ఇదిగో ఇలానే వుండి వుంటారన్పించేలా దగ్గుబాటి రానా, 'నారా చంద్రబాబునాయుడు' పాత్రలో కన్పించారు. ఆ లుక్ నిన్ననే విడుదలైంది.
ఇప్పుడు స్వర్గీయ ఎన్టీఆర్‌తో నారా చంద్రబాబునాయుడు ఎలా వుండేవారన్నదానికి సంబంధించి మరో లుక్ బయటకు వచ్చింది. స్వర్గీయ ఎన్టీఆర్ పాత్రలో ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ నటిస్తుండగా, నారా చంద్రబాబునాయుడు పాత్రలో రానా నటిస్తున్నాడు. ఈ ఇద్దరి లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తెలుగుదేశం వ్యవస్థాపకుడిగా స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతారు. మహానటుడిగా ఆయన స్థానం తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పటికీ పదిలం. ఆ లెగసీని నటుడిగా బాలకృష్ణ కొనసాగిస్తోంటే, ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని నడిపిస్తున్నారు నారా చంద్రబాబునాయుడు. స్వర్గీయ ఎన్టీఆర్ బయోపిక్‌లో ఈ రెండు పాత్రలూ అత్యంత కీలకం.
అందుకే, నారా చంద్రబాబునాయుడు పాత్ర కోసం 'భళ్ళాలదేవ' రానా దగ్గుబాటిని ఎంపిక చేశారు. తేజ దర్శకత్వంలో ప్రారంభమైన ఈ 'ఎన్‌టిఆర్', ఆ తర్వాత క్రిష్ చేతుల్లోకి వచ్చింది. నందమూరి బాలకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తూ, ఇందులో స్వర్గీయ ఎన్టీఆర్ పాత్రలోనూ, ఆయన కుమారుడు బాలకృష్ణ పాత్రలోనూ కన్పించబోతున్నారు.