నందమూరి బాలకృష్ణ ఎప్పుడు ఎవరికి అవకాశం ఇస్తాడో చెప్పలేం. ఫేడ్ అవుట్ అయిపోయిన హీరోయిన్లు, దర్శకులు.... బాలయ్య సినిమాలో కనిపిస్తుంటారు. ఇప్పుడూ బాలయ్య అదే దారిలో వెళ్తున్నాడని టాక్. బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కథానాయిక ఎవరన్నది ఇంకా తెలీలేదు. ఆ మధ్య ఓ కొత్త పేరు బయటకు వచ్చింది. ఆ అమ్మాయినే సెలెక్ట్ చేశారనుకున్నారంతా. కానీ అధికారిక సమాచారం లేదు. అయితే ఇప్పుడు చిత్రబృందం మనసు మార్చుకుందని టాక్. కథానాయికగా అంజలిని ఫిక్స్ చేశారని సమాచారం.
ఈ సినిమాలో అంజలిని తీసుకోవాల్సిందే అని బాలయ్య పట్టుపట్టాడని, ఆయన మాట కాదనలేన అంజలికి ఛాన్స్ ఇచ్చారని తెలుస్తోంది. `డిక్టేటర్`లో బాలయ్య పక్కన జోడీగా కనిపించింది అంజలి. ఆ సినిమా బాక్సాఫీసు దగ్గర అంత ఆడకపోయినా బాలయ్య - అంజలి జంట ఓకే అనిపించింది. అందుకే బాలయ్య మళ్లీ అంజలికే ఛాన్స్ ఇచ్చినట్టు సమాచారం. త్వరలోనే అంజలి పేరు అధికారికంగా ప్రకటిస్తారేమో చూడాలి.