కథానాయకులు అప్పుడప్పుడూ గొంతు సవరించుకోవడం మామూలే. నందమూరి బాలకృష్ణ కూడా అలా ఆపధర్మ గాయకుడిగా గుర్తింపు పొందారు. మొన్నటికి మొన్న పైసా వసూల్‌లో ఓ మాస్ గీతం ఆలపించారు. ఇప్పుడు మరో పాట పాడేశారు. అయితే ఈ పాట సినిమా కోసం కాదు. తన అభిమానుల కోసం. ఈనెల 10న నందమూరి బాలకృష్ణ తన పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఇది ఆయన 60వ జన్మదినం. అంటే షష్టి పూర్తి అన్నమాట. ఈ సందర్భంగా బాలకృష్ణ ఓ పాట పాడారు. అభిమానుల కోసం దాన్ని ప్రత్యేకంగా విడుదల చేయబోతున్నారు.
''నిన్న తప్పు చేసినవాళ్లని నిలదీసింది ఆ గళం.. ఇప్పుడు ఆబాలగోపాలాన్ని అలరించడానికి పాట పాడింది అదే గళం'' అంటూ ఓ పోస్టర్ విడుదల చేసింది. అయితే ఈ పాటని ఎప్పుడు, ఎలా విడుదల చేస్తారో క్లారిటీ లేదు. ఆమధ్య `మేము సైతం` అంటూ చిత్రసీమ ఓ కార్యక్రమం నిర్వహించింది. ఆ సందర్భంగా బాలయ్య మైకు పట్టుకుని గాయకుడి అవతారం ఎత్తిన సంగతి గుర్తిండే ఉంటుంది. ఆ కార్యక్రమం మొత్తానికి ఆ పాటే హైలెట్‌గా నిలిచింది. మరి ఈసారి బాలయ్య నుంచి ఎలాంటి గీతం రానుందో?