నందమూరి బాలకృష్ణ, జూ.ఎన్టీఆర్ మధ్య కోల్డ్ వార్ జరుగుతుందని వాళ్ల అభిమానులే ఒప్పుకుంటారు. చాలా యేళ్ల నుంచి ఎడమొహం పెడమొహంలా ఉన్నారు. సింహా ఫంక్షన్ కోసం ఎన్టీఆర్ వెళ్లాడు. అప్పటి నుంచీ వీరిద్దరినీ ఒకే వేదికపై చూడడం కుదర్లేదు. హరికృష్ణ మరణానంతరం పరిస్థితుల్లో కొంచెం మార్పు కనిపించింది. ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లకు బాలయ్య దగ్గరవుతున్నట్టు అనిపించింది. `అరరవింద సమేత వీర రాఘవ` ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి బాలయ్య వస్తాడని పెద్ద యెత్తున ప్రచారం కూడా జరిగింది. కానీ రాలేదు.
అయితే సక్సెస్ మీట్‌కి బాలయ్య వచ్చాడు. ఈ వార్త తెలియగానే నందమూరి అభిమానుల గుండెలు ఆనందంతో ఉప్పొంగాయి. ఎన్టీఆర్ - బాలయ్య మధ్య నడుస్తున్న కోల్డ్ వార్ ముగిసినట్టేనని అనుకున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ఈ నందమూరి కలయిక ప్రభావం చూపిస్తుందని లెక్కగట్టారు. అయితే.. అనుకున్నది వేరు, అయినది వేరు.
`అరవింద సమేత` ఫంక్షన్‌కి బాలయ్య వచ్చినా.. అది ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి కిక్ ఇవ్వలేదు. ఎందుకంటే.. బాలయ్య నోటి నుంచి ఎన్టీఆర్ అనే మాట ఒక్కటంటే ఒక్కసారే వచ్చింది. పదిహేను నిమిషాల పాటు సుదీర్ఘంగా సాగిన బాలయ్య స్పీచులో ఎన్టీఆర్ నటన గురించి గానీ, వ్యక్తిత్వం గురించి గానీ.. బాలయ్య ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చిత్రబృందం పని చేసినవారందరినీ పేరు పేరున పలకరించి, వాళ్ల గురించి నాలుగు మాటలు చెప్పిన బాలయ్య... ఎన్టీఆర్ గురించి మాట్లాడకపోవడం ఆశ్చర్యపరిచింది.పైగా `అరవింద సమేత` సినిమా నేను చూడలేదు అని స్టేట్‌మెంట్ ఇచ్చి మరో షాక్ ఇచ్చాడు. సాధారణంగా ఇలాంటి సక్సెస్ మీట్లకు వచ్చే అతిథులు సినిమా చూసి వస్తారు. అప్పుడే ఆ సినిమా గురించి గొప్పగా మాట్లాడే అవకాశం వస్తుంది. కానీ బాలయ్య సినిమా చూసి రాకపోవడం కూడా.. ఎన్టీఆర్ అభిమానుల్లో సందేహాలు రేకెత్తిస్తోంది.
బాలయ్య రాక, ఆయన స్పీచు చూస్తే.. ఇదేదో మొక్కుబడి వ్యవహారంలా మారిందని, ఎవరిదో బలవంతంపైనే బాలయ్య వచ్చాడని అప్పుడే గుసగుసలు మొదలయ్యాయి. ఏడేళ్ల తరవాత బాబాయ్ అబ్బాయ్‌లను ఒకే వేదికపై చూశామన్న సంతృప్తి కూడా నందమూరి అభిమానుల్లో ఆవిరైపోయింది. ఈ మాత్రం దానికి బాలయ్య ఎందుకొచ్చినట్టో.. అని స్వయంగా నందమూరి అభిమానులే సభాస్థలి దగ్గర మాట్లాడుకోవం కనిపించింది.