`ఆహా`లో బాలకృష్ణ చేస్తున్న టాక్ షో.. `అన్ స్టాపబుల్`. ఈ సిరీస్ ఓ రేంజ్‌లో హిట్టయ్యింది. ఆహా తరపున అత్యధిక వీక్షకులు చూసిన పోగ్రాం ఇదే. ఎపిసోడ్ ఎపిసోడ్ కి బాలయ్య రాటు దేలడం, కల్మషం లేకుండా, తానో స్టార్ అని చూడకుండా ప్రవర్తించడంతో, ఈ షో రక్తి కట్టింది. తెలుగు ఓటీటీ చరిత్రలోనే అతి పెద్ద విజయాన్ని అందుకున్న షో ఇది. అయితే ఇది ఇప్పుడు పూర్తి కావొచ్చింది. రవితేజ ఎపిసోడ్ తో మొత్తం 12 ఎపిసోడ్లు పూర్తయ్యాయి. దాంతో సీజన్ 1 సమాప్తమైనట్టు లెక్క.
నిజానికి 8 ఎపిసోడ్లతో సీజన్ 1, మరో 8 ఎపిసోడ్లతో సీజన్ 2 చేయాలనుకున్నారు. కానీ ఈ షోకి వస్తున్న స్పందన చూసి, ఒకే సీజన్ కి 12 ఎపిసోడ్లు లాగించేశారు. అయితే ఇప్పుడు సీజన్ 2 చేస్తారా, లేదా? అనేది డౌటు. రావాల్సిన సెలబ్రెటీలు ఇంకా ఉన్నా, ఈ షోకి ఆదరణ వస్తున్నా.. సీజన్ 2 చేసే ఆలోచన దాదాపు లేనట్టే. ఆ స్థానంలో బాలయ్యతోనే మరో వెరైటీ పోగ్రాం చేయిస్తే ఎలా ఉంటుందా? అని టీమ్ ఆలోచిస్తోందని టాక్. బాలయ్యతో మాట్లాడి, సీజన్ 2 గురించిన ప్లానింగ్ మొదలెట్టాలని ఆహా భావిస్తోంది. అన్ స్టాపబుల్ కి సంబంధించి తాను ఇచ్చిన కాల్షీట్లు అయిపోవడంతో ఇప్పుడు గోపీచంద్ మలినేని సినిమాపై ఫోకస్ పెట్టాడు బాలయ్య. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ మొదలు కానుంది.