ఈ సంక్రాంతి కాస్త చిరంజీవి Vs బాలకృష్ణగా మారిపోయింది. చిరు - వాల్తేరు వీరయ్య, బాలయ్య - వీర సింహారెడ్డి ఈ పండక్కి ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే.రెండు సినిమాలూ ఒక రోజు వ్యవధిలో విడుదల కావడం విశేషం. ఈ రెండు చిత్రాలకు సంబంధించిన ప్రమోషన్ల పోటా పోటీగా సాగుతున్నాయి. ఇప్పటికే వాల్తేరు నుంచి రెండు పాటలొచ్చాయి. వీర సింహా రెడ్డి నుంచి రెండు పాటలు విడుదలయ్యాయి. వీర సింహారెడ్డి నుంచి ముచ్చటగా మూడో పాట లోడింగ్ అవుతోంది.
సుగుణ సుందరి పాటలో... బాలయ్య స్టెప్పులు ఇరగదీశాడు. బాలయ్య గ్రేస్‌కి ఫ్యాన్స్ సాహో అంటున్నారు. ఇప్పుడు చిరంజీవి వంతు వచ్చింది. `చిరంజీవి - శ్రీదేవి` పాటలో.. చిరు క్లాసీ స్టెప్పులు అభిమానులతో క్లాప్స్ కొట్టిస్తున్నాయి. మంచు కొండల్లో చిరు వేసిన స్టెప్పులు, ముఖ్యంగా మౌత్ ఆర్గాన్ తో వేసిన క్లాస్ స్టెప్.. అబ్బుర పరిచేలా ఉంది. `బాస్ పార్టీ` పాటలో చిరు మాస్ స్టెప్పులు వేసిన సంగతి తెలిసిందే. మొత్తానికి ఈ వెటరన్ హీరోలు స్టెప్పుల్లో తమదైన వాడీ వేడీ చూపిస్తున్నారు. ఈతరం హీరోలకు ఇప్పటికీ సవాల్ విసురుతున్నారు. చిరంజీవి సినిమా అంటే డాన్సులు, ఫైట్లూ. బాలయ్య సినిమాల నుంచి కూడా ఇవే ఆశిస్తారు. ఇవి రెండూ సంక్రాంతి సినిమాల్లో బోల్డు ఉన్నాయన్న సంగతి ఈ పాటలతోనే అర్థమైపోతోంది. మొత్తానికి ఈ పండగ అదిరిపోయేలానే ఉంది.