ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్ జోరుగానే సాగుతోంది. ఆమధ్య `నారప్ప`లో కనిపించింది. `విరాటపర్వం`లో ఓ కీలకమైన పాత్ర పోషించింది. ఇప్పుడు బాలకృష్ణ సరసన నటించే ఛాన్స్ అందుకుంది. బాలకృష్ణ - అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో బాలయ్య కూతురుగా శ్రీలీల కనిపించనుంది. బాలయ్య భార్యగా ప్రియమణిని ఎంపిక చేసుకున్నట్టు సమాచారం. వీరిద్దరూ జోడీ కట్టడం ఇది రెండో సారి. ఇది వరకు `మిత్రుడు`లో ఇద్దరూ జంటగా నటించిన సంగతి తెలిసిందే.
ఇటీవల అనిల్ రావిపూడి.. ప్రియమణిని కలిసి పాత్ర తీరుతెన్నుల గురించి వివరించినట్టు తెలుస్తోంది. పాత్ర నచ్చడంతో.. వెంటనే ఓకే చెప్పేసింది ప్రియమణి. ఈ సినిమాలో ప్రియమణి పాత్ర చాలా హుందాగా సాగబోతోందని సమాచారం.ప్రస్తుతం బాలకృష్ణ... గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అది పూర్తవ్వగానే అనిల్ రావిపూడి చిత్రం సెట్స్‌పైకి వెళ్తుంది.