ఓ తండ్రి జీవితాన్ని సినిమాగా తీస్తూ.. తండ్రి పాత్రని కొడుకు పోషించడం బహుశా ప్రపంచ సినిమా చరిత్రలోనే నందమూరి బాలకృష్ణకు సాధ్యమైందేమో! అంతే కాదు.. బయోపిక్‌ని రెండు భాగాలుగా తీయడం, రెండూ నెల రోజుల వ్యవధిలో విడుదల చేయడం నిజంగా ఓ అద్భుతం అనుకోవాలి. ఈ సినిమాలో బాలయ్య ఏకంగా 70 గెటప్పుల్లో కనిపించనున్నాడు.
అలనాడు ఎన్టీఆర్ చేసిన పాత్రలన్నీ తను పోషించి.. ఆ ముచ్చట తీర్చేసుకున్నాడు. అందుకే ఆడియో వేదికపై 'నా కోరికలన్నీ ఈ సినిమాతో తీర్చేసుకున్నా' అన్నారు బాలయ్య. ''నా కోరికలన్నీ ఈ సినిమాతో నెరవేర్చుకున్నా. ఎన్టీఆర్ సినిమా వ్యాపారం కోసం చేయలేదు. ఓ మంచి సినిమా చేయాలి అనుకుని ఈ సినిమా చేశాం. రౌడీ ఇనస్సెప్టర్ సమయంలో సొంత బ్యానర్ పెట్టి సినిమా తీయాలని అనుకున్నా. కానీ ఇప్పటికి కుదిరింది.
ఎన్టీఆర్ బయోపిక్ నేను తీయాలని రాసి పెట్టి ఉంది. ఈ సినిమా నందమూరి కుటుంబ సభ్యులందరి ఆమోదంతో, వాళ్ల సమ్మతి తీసుకుని చేశా. రామారావుగారిని బాలకృష్ణ ఆలోచనలో ఎలా చూపించాలో క్రిష్ చూపించారు. ఇది కేవలం అభిమానుల సినిమా కాదు. ఆబాల గోపాలం ఈ సినిమా చూసి తరించాలి'' అని తన ప్రసంగంలో పేర్కొన్నారు బాలకృష్ణ.