శుక్రవారం వస్తోందంటే.. సగటు సినీ ప్రేక్షకుడు... థియేటర్ ముందు క్యూ కట్టడానికి రెడీ అయిపోతాడు. ఈమధ్య వారానికి రెండు మూడు సినిమాలొస్తున్నాయి. దాంతో ఆ హుషారు ఇంకాస్త ఎక్కువగా కనిపిస్తోంది. నిర్మాతలు కూడా.. తొలి రోజు వసూళ్ల కోసం ఆరారగా ఎదురు చూస్తుంటారు. ఈ వారం కూడా రెండు కొత్త సినిమాలొచ్చాయి. `అరణ్య`, `రంగ్ దే` బాక్సాఫీసు దగ్గర ఢీ కొట్టాయి. అయితే.. ఈ రెండు సినిమాలకూ `బంద్` సెగ తగిలింది
. ఈరోజు భారత్ బంద్. దాంతో కొన్ని చోట్ల మార్నింగ్ షోలు పడలేదు. ఆంధ్రాలో ఈ ప్రభావం ఎక్కువగా కనిపించింది. ముఖ్యంగా విశాఖ, రాజమండ్రి, కర్నూల్ లాంటి ప్రాంతాల్లో మార్నింగ్ షో లు పడలేదు. మాట్నీ నుంచి తెరచుకున్నా... ఓపెనింగ్స్ కి గండి పడిపోయింది. తెలంగాణలో బంద్ ప్రభావం లేకపోయినా, ఆంధ్రాలో మార్నింగ్ షోలు రద్దు కావడంతో, `అరణ్య`, `రంగ్ దే` నిర్మాతలు నిరుత్సాహానికి గురయ్యారు. ఈ వసూళ్లు... శని, ఆదివారాలు కవర్ చేసుకోవాలి మరి.