పవన్‌కళ్యాణ్‌ని దేవుడిగా భావిస్తాడు సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్. పవన్ - గణేష్ ఒకే వేదిక మీద కన్పించాల్సి వస్తే, గణేష్ చూపించే అభిమానాన్ని పవన్‌కళ్యాణ్ సైతం తట్టుకోలేడు. భక్తిపారవశ్యంతో పూనకం వచ్చి ఊగిపోతుంటాడు బండ్ల గణేష్. నిర్మాతగా పవన్‌కళ్యాణ్‌తో బండ్ల గణేష్ రెండు సినిమాలు నిర్మించిన సంగతి తెల్సిందే.
పవన్‌కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాక, బండ్ల గణేష్ కూడా ఆయనతోనే నడుస్తాడని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా బండ్ల గణేష్, కాంగ్రెస్ పార్టీలో చేరాడు. కాంగ్రెస్‌లో చేరినప్పటికీ పవన్‌కళ్యాణ్ మీద తనకున్న భక్తి తగ్గబోదని బండ్ల గణేష్ చెప్పాడు. చిన్నప్పటినుంచీ కాంగ్రెస్ పార్టీ అంటే బండ్ల గణేష్‌కి ఎంతో ఇష్టమట. త్వరలో తెలంగాణలో జరగనున్న ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయాలనేది ఆయన ఆలోచన. షాద్‌నగర్ లేదా జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేయాలన్న తన ఆలోచనని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ముందర బండ్ల గణేష్ వుంచినట్లు తెలుస్తోంది.
జనసేన పార్టీ తెలంగాణ ఎన్నికల పట్ల సానుకూలంగా లేకపోవడంతోనే బండ్ల, కాంగ్రెస్‌లోకి వెళ్ళాలనే ఆలోచన చేశాడని కొందరు అంటున్నారు. అయితే రాజకీయం వేరు, సినీ అభిమానం వేరని బండ్ల గణేష్ స్పష్టం చేశాడు. కాంగ్రెస్‌లో వున్నప్పటికీ, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ మీద తనకు అభిమానం తగ్గదనీ, పవన్‌కళ్యాణ్‌కి తానెప్పుడూ భక్తుడినేనని చెప్పాడు బండ్ల గణేష్.