బండ్ల గణేష్ తీసింది కొన్ని సినిమాలే. అయితే... పెద్ద పెద్ద స్టార్లతో పనిచేశాడు. పవన్ కల్యాణ్, ఎన్టీఆర్లతో చెరో రెండు సినిమాలు తీశాడు. అల్లు అర్జున్, రామ్ చరణ్లతోనూ పనిచేశాడు. అయితే వాటిలో కొన్నే హిట్లు. చాలా సినిమాలు నష్టాలనే చవి చూశాయి. అందుకేనేమో ఇప్పుడు రూటు మారుస్తానంటున్నాడు. పెద్ద హీరోలు, పెద్ద కాంబినేషన్ల వైపు చూడకుండా.. చిన్న సినిమాలు తీస్తానంటున్నాడు. కనీసం ఓ పదిమంది కొత్త వాళ్లని దర్శకులుగా పరిచయం చేస్తానంటున్నాడు బండ్ల.
''అప్పట్లో రామానాయుడు, ఇప్పుడు దిల్ రాజు కొత్తవాళ్లకు అవకాశాలిచ్చారు. నేనూ వాళ్ల బాటలో నడవాలనుకుంటున్నాను. కనీసం పదిమంది దర్శకుల్ని పరిశ్రమకు పరిచయం చేద్దామనుకుంటున్నాను. ఇక నుంచి చిన్న సినిమాలు, హిట్టు సినిమాలు తీస్తా. లాక్ డౌన్ సమయంలో కొన్నికథలు కూడా విన్నా. త్వరలో కొత్త సినిమా ప్రకటిస్తా'' అన్నాడు బండ్ల. అయితే తాను ఇక మీదట హరీష్ శంకర్ అనే దర్శకుడితోపనిచేయనని.. గట్టిగా చెప్పాడు. గత కొన్ని రోజులుగా హరీష్ - బండ్ల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. అందుకే... హరీష్ ని దర్శకుల లిస్టు నుంచి పక్కన పెట్టేశాడు.