హాస్య నటుడిగా రాణించిన బండ్ల గణేష్ ఆ తరవాత నిర్మాతగానూ మారి కొన్ని విజయాలు అందుకున్నాడు. గబ్బర్ సింగ్ కి తనే నిర్మాత. ఆ వెను వెంటనే కొన్ని ఫ్లాపులు తగలడంతో తేరుకోలేకపోయాడు. మధ్యలో రాజకీయాలంటూ కొన్ని రోజులు హడావుడి చేసి చేతులు కాల్చుకున్నాడు. ఓ హీరోని మోసం చేశాడన్న అభియోగం బండ్లపై ఉంది. సరిలేరు నీకెవ్వరుతో రీ ఎంట్రీ ఇచ్చి - మళ్లీ భంగపడ్డాడు. ఆ సినిమాతో తనకు పూర్వవైభవం వస్తుందనుకుంటే.. అదీ జరగలేదు.
ఇప్పుడు బండ్ల గణేష్‌కి మరో దెబ్బ తగలింది. బండ్ల ఫౌల్ట్రీ పరిశ్రమ నడుపుతున్న సంగతి తెలిసిందే. ఫౌల్ట్రీతోనే లాభాలు అందుకుని నిర్మాత అయ్యాడు. తెలంగాణలో కోళ్ల రేటు, గుడ్డు రేటు నిర్ణయించగలిగే అతి కొద్ది మంది బడా వ్యాపార వేత్తల్లో బండ్ల ఒకడు. అయితే.. కొన్నాళ్లుగా ఈ పరిశ్రమపై కరోనా ప్రభావం చూపిస్తోంది. కోళ్లు, గుడ్ల అమ్మకాలు విపరీతంగా పడిపోయాయి. దానికి తోడు రేటు కూడా పాళాళంలో ఉంది. ఈ నెల రోజుల్లోనే కోట్ల రూపాయల్లో నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. కోడిమాంసం తిన్నంత మాత్రన కరోనా రాదని, కోడి గుడ్లు సురక్షితమే అని ప్రచారం చేయించినా లాభం లేకుండా పోయింది. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే మరింత భారీ నష్టాలు చవిచూసే ప్రమాదం ఉంది. పాపం.. బండ్ల బాబుకి ఎన్ని కష్టాలో కదూ.