ఏపీ ప్రభుత్వం ఏ ముహూర్తాన నంది అవార్డులు ప్రకటించిందో కానీ, అప్పటి నుండి దాని చుట్టూ వివాదాలు వస్తూనే ఉన్నాయి. అవార్డుల కేటాయింపులో ఒక వర్గానికే ప్రయోజనం చేకూరిందని సాధారణ వ్యక్తుల నుండి సినిమా నిర్మాతల వరకూ, నంది అవార్డులు ప్రకటించిన తీరుపై విమర్శలు గుప్పిస్తూనే వస్తున్నారు.
ఇప్పటికే నిర్మాత బన్నీ వాసు, దర్శకుడు గుణశేఖర్ తన అసహనాన్ని వెళ్లబుచ్చారు. తాజాగా ఇప్పుడు అదే కోవలో నిర్మాత బండ్ల గణేష్ చేరారు. అవార్డుల ఎంపిక విషయంలో మెగా ఫ్యామిలీ కి అన్యాయం జరిగిందని, అవి నంది అవార్డులు కాదు.. సైకిల్ అవార్డులు అంటూ వివాదాస్పద వాఖ్యలు చేశారు. తర్వాత తాను చేసిన తప్పు తెలుసుకుని ఆ మాటలు వెనక్కి తీసుకున్నారు.
నిన్న ఒక ఛానల్ లైవ్ లో మాట్లాడిన బండ్ల గణేష్ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పై, నంది అవార్డుల జ్యూరీ పై విరుచుకుపడ్డాడు. మెగా ఫ్యామిలీ ని పట్టించుకోవడం లేదనే విషయం ఈ అవార్డులు చూస్తే తెలిసిపోయింది. అవార్డులు చూస్తే చాలా కామెడీగా అనిపించింది. వాళ్ళ ఇంట్లో వాళ్లకి, వాళ్ళ అన్నలకి, తమ్ముళ్ళకి, టీడీపీ పార్టీ కోసం పనిచేసే వాళ్లకి ఇచ్చినట్లుగా ఉంది. నా సినిమా 'గోవిందుడు అందరివాడేలే' లో చరణ్ అద్భుతంగా నటించాడు. కానీ అతనికి అవార్డు రాలేదు అని పేర్కొన్నాడు.
చిరంజీవి కి ప్రకటించిన రఘుపతి వెంకయ్య అవార్డు విషయంలోనూ గణేష్ తీవ్ర వాఖ్యలు చేసాడు. అదొక కంటితుడుపు అవార్డు అని తీసిపారేసాడు. రఘుపతి వెంకయ్య అవార్డు ను కంటి తుడుపు అవార్డుతో పోల్చడం పై జ్యూరీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఒక నిర్మాత అయ్యుండి ఇంత దిగజారుడు గా మాట్లాడటం మంచిది కాదని జ్యూరీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసారు.