నటీనటులు : జ్యోతిక, భాగ్యరాజ్, పార్తీబన్ తదితరులు
దర్శకత్వం : జె జె ఫ్రెడ్రిక్
నిర్మాతలు : సూర్య
సంగీతం : గోవింద్ వసంత
సినిమాటోగ్రఫర్ : రాంజీ
ఎడిటర్: రూబెన్
రేటింగ్: 2.75/5
లాక్ డౌన్ వల్ల... థియేటర్లు మూతబడ్డాయి. ఇప్పుడు సినిమా అంటే ఓటీటీనే. తమిళ, మలయాళ భాషల్లో విడుదలైన చాలా చిత్రాలు ఇప్పుడు ఓటీటీలో డబ్బింగుల రూపంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. జ్యోతిక నటించిన కొన్ని చిత్రాలు లాక్ డౌన్ సమయంలోనే చూసే అవకాశం వచ్చింది. ఈయేడాది మేలో.. జ్యోతిక నటించిన తమిళ చిత్రం పొన్మంగల్ వంథల్ ఇప్పుడు తెలుగులో బంగారు తల్లిగా డబ్ చేశారు. ఈరోజు నుంచే ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. సూర్య నిర్మించిన చిత్రమిది. మరి ఈ సినిమా ఎలా ఉంది? జ్యోతిక - సూర్యలు చేసిన ఈ ప్రయత్నం ఏ మేరకు మెప్పించింది?
* కథ
ఊటీలో సైకో జ్యోతి అనే మహిళ.. కొంతమంది చిన్నపిల్లల్ని దారుణంగా చంపేస్తుంది. అడ్డొచ్చిన ఇద్దరు యువకుల్ని కాల్చి పారేస్తుంది. ఆ మహిళని పోలీసులు గాలించి, పట్టుకుని, ఎన్‌కౌంటర్ చేసి చంపేస్తారు. పదిహేనేళ్ల తరవాత.. ఈ కేసుని వెన్నెల (జ్యోతిక) అనే లాయరు తిరగతోడుతుంది. ఈ కేసులో మరుగున పడిపోయిన నిజానిజాల్ని బయటకు లాగే ప్రయత్నం చేస్తుంది. ఈ పోరులో పెద్ద మనిషిగా చలామణీ అవుతున్న వరదరాజులు (త్యాగరాజన్), తిమ్మిని బమ్మిగా మార్చడంలో ఉద్దండుడైన పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజారత్నం (పార్తీబన్)ని ఎదుర్కోవాల్సివస్తుంది వెన్నెల. అసలు సైకో జ్యోతి ఎవరు? ఆమె నిజంగా పపి పాపల్ని చంపేసిందా? ఆమెకీ వెన్నెలకూ ఉన్న సంబంధం ఏమిటన్నది అసలు కథ.
* విశ్లేషణ
పసి కందులపై జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాలూ చూస్తూనే ఉన్నాం. అలాంటి మరో కథ ఇది. కొన్ని కేసులు, కోర్టుల్లో ఎలా తప్పుదారి పడతాయో, పెద్ద మనుషులు కేసుల్ని ఎలా తమకు అనుకూలంగా మలచుకుంటారో - చెప్పే కథ ఇది. సైకో జ్యోతి ఉదంతంతో కథ మొదలవుతుంది. రెండు నిమిషాల్లోనే జ్యోతి ఎవరు? ఆమె ఏం చేసింది? అనేది చెప్పేశారు. ఆ తరవాత పదిహేనేళ్లకు ఈ కేసుని తిరగతోడడానికి ఓ లాయర్ వస్తుంది. అక్కడి నుంచి కథ మొదలవుతుంది. పింక్ లాంటి సినిమాలొచ్చాక.. కోర్టు డ్రామాలు పెరిగాయి. కోర్టు డ్రామా ఎంత ఇంటిలిజెంట్ గా ఉంటే, ఇలాంటి కథలు అంతగా రక్తి కడతాయి. పింక్ ప్రభావం ఈ సినిమాపై కొంత ఉందన్న విషయం అర్థం అవుతుంది. అయితే... పింక్ ఎంచుకున్న పాయింట్ వేరు, బంగారు తల్లి పాయింట్ వేరు.
కోర్టు డ్రామా అంత ఆసక్తిగా లేకపోయినా, కథ,.. అందులో దర్శకుడు చెప్పదలచుకున్న పాయింట్ లో నిజాయతీ కనిపిస్తుంది. విశ్రాంతి ముందు వచ్చే మలుపు.. ఊహించనిదే. అక్కడి నుంచి కథకు ఓ ఎమోషనల్ ఫీల్ తోడవుతుంది. సినిమా అంతా కోర్టులోనే నడుస్తుంది. పైగా తక్కువ పాత్రలు. కోర్టు డ్రామా పండాలంటే.. అవతలి లాయరు తెలివితేటల్ని చూపించాలి. కానీ.. రాజారత్నం ఎంత తెలివైన వాడో, ఎంత మాటకారో చెప్పే ఉదంతాలు చాలా తక్కువ. అందుకే రాజారత్నం - వెన్నెల మధ్య సన్నివేశాలు అంతగా రక్తి కట్టలేదు. విశ్రాంతికి ముందు ఓ ట్విస్టు వచ్చినట్టే.. పతాక సన్నివేశాల్లోనూ ఓ మలుపు వస్తుంది. కానీ.. అప్పటికే.. సినిమా అంతా ఓ కొలిక్కి వచ్చేయడంతో ఆ ట్విస్టు ఏమంత రక్తి కట్టదు.
* నటీనటులు
జ్యోతిక పాత్ర హుందాగా సాగింది. కోర్టులోపల నడిచిన సన్నివేశాల్లో పార్తీబన్ లాంటి నటుడ్ని కూడా సమర్థంగా ఎదుర్కోగలిగింది. జ్యోతిగానూ ఆమెనే కనిపించింది. ఓ తల్లి పడే వేదన ఆమె కళ్లల్లో స్పష్టంగా పలికించింది. భాగ్యరాజ్, పార్తీబన్ లాంటి మేటి నటులు ఈ సినిమాలో ఉన్నారు. వాళ్ల అనుభవం బాగా ఉపయోగపడింది. అయితే.... డబ్బింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది.
* సాంకేతిక వర్గం
సమాజంలో నలుగుతున్న ఓ పాయింట్ ఇది. ఆడపిల్ల పుడితే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. వాళ్లకు జాగ్రత్తలు చెబుతాం. అమ్మాయిల్ని ఎంత గౌరవించాలో, వాళ్లని ఎలా చూసుకోవాలో మాత్రం అబ్బాయిలకు చెప్పం. ఇదే లాయర్ వెన్నెల కోర్టులో అడిగే ప్రశ్న. ఆ ప్రశ్న చుట్టూనే ఈ కథ ఉంది. ఓ ఆడపిల్ల పుట్టినపప్పటి నుంచీ చచ్చే వరకూ ఎన్నో రూపాల్లో లైంగిక వేధింపులకు గురి అవుతోంది. వాళ్లంతా నోరు విప్పితే.. కోర్టు ముందు అందరూ దోషులే. ఈ పాయింట్ ని బాగా చెప్పగలిగారు. కథలో, సన్నివేశాల్లో నిజాయతీ ఉంది. సంభాషణలూ ఆలోచింపజేస్తాయి. ఊటీ అందాల్ని బాగా చూపించారు. నేపథ్య సంగీతం కూడా హృద్యంగా ఉంది.
* ప్లస్ పాయింట్స్
జ్యోతిక
కోర్టు సన్నివేశాలు
ఇంట్రవెల్ ట్విస్ట్
* మైనస్ పాయింట్స్
ద్వితీయార్థం
* ఫైనల్ వర్డిక్ట్: `మన బంగారుతల్లుల్ని కాపాడుకుందాం`