`సాక్ష్యం` డిజాస్టర్‌తో బెల్లంకొండ శ్రీనివాస్ చాలా డల్ అయిపోయాడు. ఆ సినిమా విడుదల తరవాత.. రెండు రోజులు ఇంటి నుంచి బయటకు రాలేదట. ఆసినిమా ని నమ్ముకున్న నిర్మాతకూ, సినిమాని కొనుగోలు చేసిన పంపిణీదారులకు భారీ నష్టాలు ఎదురయ్యాయి. ఈ ఫ్లాపు తన తదుపరి సినిమా 'కవచం'పై భారీ ప్రతాపం చూపిస్తుందనుకొన్నారు. కానీ... అనూహ్యంగా 'కవచం'కీ మంచి బిజినెస్ జరిగింది.
రూ.30 కోట్లతో తెరకెక్కిన చిత్రమిది. శాటిలైట్, డిజిటల్ హక్కుల రూపంలో దాదాపుగా రూ.20 కోట్లు వెనక్కి వచ్చేశాయి. ఇప్పుడు థియేటరికల్ రైట్స్ రూపంలో మరో రూ.16 కోట్లు దక్కాయి. నైజాం రూ.5 కోట్ల వరకూ బిజినెస్ చేసుకుంది. ఆంధ్రా హక్కుల రూపంలో మరో రూ.7 కోట్లు వచ్చాయి. కర్నాటక నుంచి కోటి రూపాయల వరకూ దక్కాయి.
సీడెడ్ రూ.3 కోట్లు వచ్చాయి. మొత్తానికి... `కవచం`తో నిర్మాతలు టేబుల్ ప్రాఫిట్ దక్కించుకున్నట్టే. మరి.. బయ్యర్ల మాటేమిటో తెలియాలంటే ఇంకొద్ది గంటలు ఆగాల్సిందే.