'రంగస్థలం' సినిమాతో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. మహేష్‌బాబు 'భరత్ అనే నేను' సినిమాతో సత్తా చాటాడు. 'అరవింద సమేత' అంటూ ఎన్టీఆర్ కూడా తన ఉనికిని చాటుకున్నాడు. అయితే 2018 సంవత్సరానికి సంబంధించి మోస్ట్ హ్యాపెనింగ్ స్టార్ అనే కేటగిరీలో అందరికంటే ముందున్నోడు యువ హీరో విజయ్ దేవరకొండ. 'నోటా' రూపంలో ఓ ఫెయిల్యూర్ అతని ఖాతాలో ఉన్నా, 'గీత గోవిందం', ట్యాక్సీవాలా' అంచనాల్ని మించి విజయాల్ని అందుకున్నాయి.
'నోటా' సినిమాని డిజాస్టర్‌గా పరిగణించలేం. క్రియేట్ అయిన హైప్‌కి భిన్నంగా ఆ సినిమా ఫలితం వచ్చిందంతే. 'టాక్సీవాలా' తేడా కొట్టి ఉంటే, 'గీత గోవిందం' సక్సెస్ మరుగున పడిపోయేదేమో. నిజానికి 'గీత గోవిందం' చాలా పెద్ద హిట్. 74 కోట్లు వసూళ్లు సాధించింది ఆ సినిమా. ఆషామాషీ విషయం కాదిది. ఖర్చు తక్కువ. లాభాలెక్కువ. 'ట్యాక్సీవాలా' సినిమా విషయంలోనూ అదే జరిగింది. ఇక 'భరత్ అనే నేను', 'అరవింద సమేత' వసూళ్ల విషయంలో గందరగోళం ఉంది.
'రంగస్థలం' వసూళ్ల విషయానికి వస్తే 2018లో బిగ్గెస్ట్ హిట్ సినిమా ఇది. పాత కాలం నాటి పరిస్థితుల్ని ఈ తరం కూడా మెచ్చేలా 'రంగస్థలం'ను తీర్చి దిద్దారు. ఇంత రిస్క్ చేసిన రామ్‌చరణ్‌కి ఖచ్చితంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. 'మహానటి'తో కలుపుకుంటే నాలుగు సినిమాలతో విజయ్ దేవరకొండ హల్‌చల్ చేశాడు. ఒక్క సినిమాతోనే చరణ్ మెగా పవర్ చూపించాడు. హీరో ఆప్ ది ఇయర్ రేస్‌లో ఈ ఇద్దరూ పోటీ పడతారు. విజయ్‌తో పోలిస్తే చరణ్‌కే రెండు మార్కులు ఎక్స్‌ట్రా పడతాయేమో.