కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే దిశగా అన్ని రకాల సంస్థలూ స్వచ్చందంగా జాగ్రత్తలు పాఠిస్తున్న సంగతి తెలిసిందే. ఐటీ సంస్థలు ఇప్పటికే మూత పడ్డాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ నియమాన్ని ఐటీ యాజమాన్యాలు అనుసరిస్తున్నాయి. ఇక ఆయా సంస్థలు తాత్కాలికంగా బంద్ ప్రకటించాయి. సినీ రంగంలోనూ ఈ బంద్ అమలు అవుతోంది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి మొదలుకొని, టాలీవుడ్‌లో పెద్ద, చిన్నా తేడా లేకుండా సినిమా షూటింగ్స్ ఆపేశారు. ఈ నెల, వచ్చే నెలల్లో రిలీజ్ కావల్సిన సినిమాలు కూడా వాయిదా పడ్డాయి. కానీ, యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న ‘అల్లుడు అదుర్స్’ సినిమా షూటింగ్ మాత్రం నిలిపి వేయలేకపోతున్నారట.
ప్రజెంట్ షెడ్యూల్‌లో అత్యంత కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ జరగనుందట. హీరో, హీరోయిన్ మధ్య చిత్రీకరించాల్సిన ఈ సన్నివేశాలు ఇప్పుడు వాయిదా వేస్తే, తర్వాత కాల్షీట్స్ రూపంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనీ భావించి చిత్ర యూనిట్ షూటింగ్ నిలిపివేయలేకపోతోందనీ తెలుస్తోంది. ప్రత్యేకమైన అతి జాగ్రత్తల నడుమ ఈ సినిమా షూటింగ్‌ని కంటిన్యూ చేయాల్సి వస్తుందని చిత్ర యూనిట్ ద్వారా అందుతోన్న సమాచారం. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బెల్లంకొండకు జోడీగా ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ నటిస్తోంది.