టాలీవుడ్ లో పెద్ద నిర్మాత కొడుకుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనదైన గుర్తింపు కోసం కష్టపడుతున్న హీరో 'బెల్లంకొండ శ్రీనివాస్'. పెద్ద పెద్ద దర్శకులతో ఎన్ని సినిమాలు చేసినా సరైన హిట్ ని తన ఖాతాలో వేసుకోలేకపోతున్నాడు. ఇటీవలే కవచం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా... ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. దాంతో కాస్త గ్యాప్ తీసుకుని మళ్ళీ సినిమాలు చేయటానికి సిద్దమవుతున్నాడు.
ఇతర భాషల్లో విజయవంతమైన చిత్రాలని తెరకెక్కించటానికి ఎవరైనా ఒక అడుగు ముందుకు వేస్తారు. కిందటి సంవత్సరంలో తక్కువ బడ్జెట్లో నిర్మితమై ఎక్కువ లాభాలను తెచ్చిపెట్టిన తమిళ సినిమాల్లో 'రాచ్చసన్' ఒకటి. విష్ణు విశాల్ మరియు అమలాపాల్ నటించిన ఈ చిత్రం చిన్న సినిమాగా విడుదలై దాదాపు 20 కోట్ల లాభాలను తెచ్చిపెట్టింది. అలాంటి ఈ సినిమా రీమేక్ హక్కులను హీరో నితిన్ కొన్నాడని, ఆయనే హీరోగా ఈ సినిమాని తెరకెక్కిస్తారని అప్పట్లో వార్తలు వినిపించాయి.
కానీ, ఆ విషయంపై ఇప్పుడు వేరే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ సినిమా రీమేక్ హక్కులు వేరే హీరో చేతుల్లోకి వెళ్లినట్టు ఫిలింనగర్ వార్తలు వినిపిస్తున్నాయి. ఆ హీరో మరెవరో కాదు... బెల్లంకొండ శ్రీనివాస్. దర్శకనిర్మాతలు ఎవరన్నది ఇంకా బయటికి రాలేదు కానీ, ఆ సినిమాని మాత్రం బెల్లంకొండ చేయబోతున్నట్లు తాజా సమాచారం. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అన్ని వివరాలు బయటికి రానున్నాయి. తమిళంలో ఘన విజయాన్ని సాధించిన ఈ సస్పెన్స్ సైకో థ్రిల్లర్ తెలుగు ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకొనుందో చూడాలి మరి..!