బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. ఇప్పుడిప్పుడే కథానాయికుడిగా ఎదుగుతున్నాడు. మాస్ కథల్ని ఎంచుకుని, డాన్సులు, ఫైటులతో మురిపిస్తున్నాడు. తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుండడానికి కారణం.. ఆ డాన్సులూ, ఫైటింగులే. అయితే... ఇప్పుడు 'సీత' కోసం వీటిని త్యాగం చేసినట్టు అనిపిస్తోంది. తేజ దర్శకత్వంలో 'సీత' అనే సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈచిత్రంలో బెల్లంకొండ, కాజల్ జంటగా నటిస్తున్నారు.
'సీత' అనే పేరు పెట్టగానే ఈ సినిమా కథానాయిక పాత్ర చుట్టూ తిరగబోతోందని అర్థం చేసుకోవొచ్చు. ఇప్పుడు టీజర్లోనూ అదే స్పష్టమైంది. టీజర్ అంతా కథానాయికపైనే ఫోకస్ చేశాడు తేజ. పైగా బెల్లంకొండ పాత్రని 'స్వాతిముత్యం'లో కమల్‌హాసన్ రేంజులో చూపించడానికి ట్రై చేశాడు. డాన్సులు, ఫైటింగులు పక్కన పెట్టేశాడు.
ఓ రకంగా సాయికి ఇది ఛాలెంజ్ అనుకోవాలి. ఇప్పటి వరకూ కమర్షియల్ కథల్ని, కమర్షియల్ అంశాల్నీ నమ్ముకున్న బెల్లంకొండ తొలిసారి కేవలం పెర్‌ఫార్మ్సెన్స్ ఉన్న పాత్రని ఎంచుకున్నాడు. కాజల్ కోసం.. తన హీరోయిజాన్ని త్యాగం చేశాడు. మరి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. ఈనెలలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.