అప్పుడే మూడు నెలలు గడిచిపోయాయి. 90 రోజుల్లో టాలీవుడ్‌లో కనిపించిన ఏకైక హిట్. ఎఫ్ 2. కల్యాణ్ రామ్ నటించిన 118 ఓకే అనిపించుకుంది అంతే. మార్చి చివరి వారంలో రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. లక్ష్మీస్ ఎన్టీఆర్, సూర్యకాంతం తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. వీటిలో మంచి మార్కులు అందుకున్న చిత్రమేది?
రెండు సినిమాలలో అందరి దృష్టినీ ఆకర్షించిన సినిమా మాత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. రాంగోపాల్ వర్మ నుంచి వచ్చిన ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూశారు. ఎన్టీఆర్ వెన్నుపోటు చుట్టూ తిరిగే కథ ఇది. అందుకే... విడుదలకు ముందు నుంచీ సంచలనాలు సృష్టిస్తూనే ఉంది. విడుదలకు కొద్ది గంటల ముందు కూడా హైడ్రామా నడిచింది. ఏపీలో ఈ సినిమా విడుదల కానేలేదు. అయితే ఏపీ మినహా ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదలైంది. టాక్ ఎలాగున్నా.. టాక్ ఆఫ్ ది టౌన్‌గా మాత్రం నిలిచింది.
టీడీపీ ప్రత్యర్థులకు ఈ చిత్రం ఓ ప్రచారాస్త్రంగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు. బడ్జెట్, వస్తున్న వసూళ్లు రెండింటినీ బేరీజు వేస్తే.. ఇది లాభదాయకమైన ప్రాజెక్టే. అదే ఏపీలోనూ విడుదలైతే... ఆ లాభాలు రెండు మూడు రెట్లు ఎక్కువగా ఉండేవి. ఎలక్షన్ సీజన్ నడుస్తూఉండడం, వర్మ సినిమా కావడం, దానికి తోడు... బాక్సాఫీసు దగ్గర సరైన పోటీ లేకపోవడం ఈ చిత్రానికి కలిసొచ్చే అంశాలు.
ఇక నిహారిక సూర్యకాంతం కూడా ఈ వారమే వచ్చింది. కథ, కథనాలలో దమ్ము లేకపోవడం, రొటీన్ ఫార్ములాలోనే సినిమా 'సాగడం', అన్నింటికంటే మించి వెబ్ సిరీస్ లక్షణాలు ఈ చిత్రంలో పుష్కలంగా కనిపించడంలో... ప్రేక్షకులు ఈ చిత్రాన్ని తిప్పికొట్టారు. పైగా.. పబ్లిసిటీ కూడా అంతంతమాత్రంగానే సాగింది. నిహారిక కెరీర్‌లో మరో ఫ్లాప్ గా మిగిలిపోయింది.
వచ్చే వారం మజిలీ వస్తోంది. నాగచైతన్య - సమంత జంటగా నటించిన చిత్రమిది. ఇక నుంచి ప్రతీవారం బాక్సాఫీసు దగ్గర ఓ మంచి సినిమారాబోతోంది. యువ కథానాయకులు పోటీ పడబోతున్నారు. మే వరకూ.. సినిమాల జాతర చూడొచ్చు.