వెటరన్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మళ్లీ మెగా ఫోన్ పట్టబోతున్నారు. ఆయన ఓ బయోపిక్ తీయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. బెంగళూరు నాగరత్నమ్మ అనే సంగీత, నాట్య కారిణి జీవితాన్ని ఆయన తెరపై చూపించడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం స్క్రిప్టు పనులు జరుగుతున్నాయి. బెంగళూరులో నాగరత్నమ్మ చాలా ఫేమస్. ఆమె ఓ వేవదాసి. భరతనాట్య కారిణి. సంగీత నృత్య కళలకు ఎంతో సేవ చేసింది. త్యాగరాజు అన్నా, ఆయన కీర్తనలన్నా చాలా ఇష్టం.
అందుకే త్యాగరాజు సమాధి శిధిలావస్థకు చేరుకున్నప్పుడు తన సొంత ఖర్చుతో వాటికి మరమత్తులు చేసింది. చివరి దశలో అక్కడే కాలక్షేపం చేసింది. ఆ సమాధి ముందే నాగరత్నమ్మ తుది శ్వాస విడిచింది. త్యాగరాజు సమాధి పరిసరాల్లోనే నాగరత్నమ్మకు అంత్యక్రియలు నిర్వహించారు. ఇప్పుడు ఈ కథే తెరపై చూపించబోతున్నారు సింగీతం. మరి ఆ పాత్రలో ఎవరిని ఎంచుకుంటారో చూడాలి. ఓ స్టార్ కథానాయిక అయితేనే ఈ పాత్ర పండుతుంది. మరి ఆ అవకాశం ఎవరికి దక్కుతుందో?