ఈనెల 30న విడుదల కావాల్సిన 'భైరవగీత' సడన్‌గా వాయిదా పడింది. సెన్సార్ సమస్యల వల్ల ఈ సినిమాని అనుకున్న సమయానికి విడుదల చేయడం కుదరడం లేదని, వర్మ చెప్పేశారు. మరి భైరవ గీతకొచ్చిన సమస్యేంటి? ఎందుకు ఈ సినిమా సెన్సార్ అవ్వలేదు.. అని ఆరా తీస్తే ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి.
తెలుగు సినిమా సెన్సార్ హైదరాబాద్‌లో జరుగుతుంది. అయితే.. ఇది తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల అవుతోంది. ఈ సినిమా సెన్సార్‌ని బెంగళూరులో చేయించాలని వర్మ భావించారు. అందుకోసం దరఖాస్తు కూడా చేసుకున్నారు. అయితే.. అక్కడి సెన్సార్ బోర్డు.. తెలుగు సినిమాని సెన్సార్ చేయడానికి అభ్యంతరం చెప్పిందని సమాచారం. కన్నడ వెర్షన్ సెన్సార్ పూర్తయినా.. అన్ని భాషల్లోనూ ఒకేసారి విడుదల చేయాలన్న ఉద్దేశంతో ఈ సినిమాని వాయిదా వేశారు వర్మ.
ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, వర్మ శైలి పబ్లిసిటీతో... భైరవ గీత కావల్సినంత క్రేజ్ తెచ్చుకుంది. రోబో 2.ఓకి పోటీగా వర్మ ఈ సినిమా విడుదల చేయడానికి చూడడం.. సంచలనం కలిగించింది. అయితే.. సడన్‌గా ఈ సినిమా వాయిదా పడడం... వర్మ అభిమానుల్ని కాస్త నిరుత్సాహానికి గురి చేసింది.