సినిమాల్లో వర్మ సినిమా వేరయా.! అనాలి. ఎందుకంటే, ఏదో మత్తు, మాయ ఉంటుంది వర్మ సినిమాల్లో. అందుకే ఎక్కువగా సినిమాలు చేయకపోయినా, చేసిన సినిమాలు హిట్ కాకపోయినా డైరెక్టర్‌గా వర్మకున్న క్రేజ్ మాత్రం తగ్గదంతే. వర్మ నుండి సినిమా వస్తుందంటే చాలు ఆటోమెటిగ్గా అంచనాలు క్రియేట్ అయిపోతాయి.
ఇకపోతే అసలు విషయం ఏంటంటే, ఈ మధ్య వర్మ గారి శిష్యులు ఒక్కొక్కరుగా వరుస కడుతున్నాడు. మొన్నీ మధ్యనే ప్రేక్షుల ముందుకొచ్చిన 'ఆర్‌ఎక్స్ 100' చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు అజయ్ భూపతి వర్మ శిష్యుడేనన్న సంగతి తెలిసిందే. ఆ సినిమా ఏ రేంజ్‌లో హిట్ కొట్టిందో కూడా తెలిసిన విషయమే. లేటెస్టుగా మరో శిష్యుడు తన సత్తా చాటబోతున్నాడు. ఆయన పేరు సిద్ధార్ధ.
'భైరవగీత' చిత్రంతో దర్శకుడుగా పరిచయం కాబోతున్నాడు. రాయలసీమ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రం ట్రైలర్‌ని వర్మ తన ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే అచ్చం రామ్‌గోపాల్ వర్మ సినిమా చూస్తున్నట్లే ఉంది. వర్మ తెరకెక్కించిన 'రక్తచరిత్ర' ఫ్లేవర్ ఈ సినిమాలో ఫుల్ డోస్‌లో కనిపించింది. యదార్ధ ఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. తన ప్రేమను కాపాడుకోవడానికి సమాజాన్ని ఎదుర్కొనే కుర్రాడిగా హీరో క్యారెక్టర్‌ని చాలా పవర్‌ఫుల్‌గా డిజైన్ చేశారు.
వర్మ మార్కు హత్యలు, రక్తపాతం, రొమాన్స్ అంతా అచ్చంగా అలా దించేసినట్లు కనిపిస్తోంది ట్రైలర్ చూస్తుంటే. ధనుంజయ్, ఇరా జంటగా నటిస్తున్నారు. ట్రైలర్ ఎండింగ్‌లో లిప్‌లాక్ టోటల్‌గా సినిమాపై ఆశక్తిని పెంచేస్తోంది.