దర్శకుడిగా వర్మ ఏంటో అందరికీ తెలిసిందే. అయితే ఆయన ఈ మధ్య నిర్మాతగా కూడా పలు చిత్రాలు రూపొందిస్తున్నారు. అందులో భాగంగా ఆయన నిర్మాణ భాగస్వామ్యంలో రూపొందుతోన్న చిత్రం 'భైరవగీత'. కొత్త దర్శకుడు టి. సిద్ధార్ద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. కన్నడ నటుడు ధనుంజయ హీరోగా నటిస్తున్నాడు. కొత్తమ్మాయి ఇరా హీరోయిన్‌గా పరిచయమవుతోంది.
ఇటీవల విడుదలైన ట్రైలర్‌కి మంచి రెస్పాన్సే వచ్చింది. వర్మ స్టైల్ మేకింగ్ స్కిల్స్ ఆ ట్రైలర్‌లో చూపించారు. కాగా ఈ సినిమాని కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారట. అందుకే అక్టోబర్‌లో విడుదల కావాల్సిన ఈ చిత్రం కాస్త ఆలస్యంగా విడుదలవుతోంది. నవంబర్ 22న ఈ నాలుగు భాషల్లోనూ 'భైరవగీత'ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు మొదలు పెట్టింది.
ఇదిలా ఉంటే, రియల్ లవ్ స్టోరీగా రూపొందుతోన్న ఈ చిత్రంలో బోలెడన్ని సస్పెన్స్‌లున్నాయనీ విశ్వసనీయ వర్గాల సమాచారమ్. రాయలసీమ ఫ్యాక్షనిజాన్ని ఈ చిత్రంలో హైలైట్ చేసినట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. రక్తపాతం, అరాచకంతో పాటు, హీరో, హీరోయిన్స్ మధ్య రొమాన్స్ లోతుల్ని మరీ బోల్డ్‌గా 'అంతకుమించి' అనే స్థాయిలో చూపించేశారు. ఇటీవల ఇలాంటి బోల్డ్ కంటెన్ట్ లేకుండా చిన్న సినిమాలు అస్సలు రూపొందడం లేదనే చెప్పాలి.
ఇదే ఇప్పుడు చిన్న సినిమాలకు సక్సెస్ ఫార్ములా అయిపోయింది. అవసరం ఉన్నా లేకున్నా, ఎక్కడో చోట బోల్డ్ సీన్స్ యాడ్ చేయడం, టీజర్‌తోనో, ట్రైలర్‌తోనో ఆ సీన్స్‌ని హైలైట్ చేయడం ద్వారా ఆడియన్స్‌ని ఎట్రాక్ట్ చేయడం షరా మామూలైపోయింది. ఆ కోవలో 'భైరవగీత' ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి మరి.