`ఆచార్య` నుంచి ఈరోజు `భలే భలే బంజారా` పాట విడుదల అయ్యింది. . చిరు, చరణ్‌లు కలిసి స్టెప్పులు వేసే పాట కాబట్టి, ఇదెలా ఉందో? అని అభిమానులంతా ఆత్రుతగా ఎదురు చూడడం సహజం. అయితే.. ఈ పాటని ప్రమోట్ చేయడానికి ఇటీవల చిరు, చరణ్, కొరటాల కలిసి ఓ వీడియో చేశారు. అందులో చిరు.. `నాటు నాటు పాట తరవాత.. చరణ్‌తో స్టెప్పులు వేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుందని, ఆ పాటతో పెరిగిన అంచనాలు అందుకుంటాననో లేదో అని చెబుతూ... `సెట్లోకి రా చూసుకుందాం నువ్వో నేనో` అంటూ చరణ్‌ని సరదాగా ఛాలెంజ్ చేశారు.
అయితే చిరు అత్యుత్సాహంతోనో, లేదంటే కాంపిటేటీవ్ స్పిరిట్‌తోనో.. `నాటు నాటు` పాటతో పోలిక తీసుకొచ్చారు. ఈమధ్య కాలంలో `నాటు నాటు` పాట ఎంతగా జనంలోకి చొచ్చుకుపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరు హీరోలు (చరణ్, ఎన్టీఆర్)లు కలిసి పాటకు స్టెప్పులేయడం.. ప్రేక్షకులకు ఓ మర్చిపోలేని అనుభూతి ఇచ్చింది. ఆర్.ఆర్.ఆర్ మేజర్ హైలెట్స్‌లో అదొకటి. ఇప్పుడు మళ్లీ ఇద్దరు హీరోలు (చిరు, చరణ్)లు కలిసి నాట్యం చేస్తే.. కచ్చితంగా `నాటు నాటు`తో పోలికలు వస్తాయి. అలా పోలిక రాకుండా జాగ్రత్త పడడం పోయి.. చిరు కావాలనే `నాటు నాటు` పాటని ప్రస్తావించి.. `పోల్చి చూసుకోండి.. ఫర్వాలేదు` అనే హింట్ ఇచ్చేశారు. `నాటు నాటు` పాటతో గనుక... `భలే భలే బంజారా`ని పోల్చి చూస్తే చిరు, చరణ్‌లు ఒకే స్క్రీన్‌పై కలిసి స్టెప్పులు వేస్తున్నారన్న ఫీలింగ్ పోయి.. పోలికలే మిగులుతాయి. ఇది పాటకూ, సినిమాకు కూడా మంచిది కాదు. పైగా నిన్న విడుదలైన `భలే బంజారా` ఓకే అనిపించింది. వినగానే పట్టేసే ట్యూన్ అయినా సరే.. ఇది వరకే ఈ పాట విన్న ఫీలింగ్ వచ్చింది. దాంతో పాటు.. చిరు స్టైల్ లో సిగ్నేచర్ స్టెప్ ఏదీ ఈ పాటలో కనిపించలేదు. అయితే... సినిమాలో కిక్ కోసం.. సిగ్నేచర్ స్టెప్పులన్నీ దాచేసి, ఒకేసారి వెండి తెరపై చూపించాలని చిత్రబృందం భావించిందేమో..? మరి ఈ పాట థియేటర్లో ఏ రేంజ్‌లో ఉంటుందో తెలియాలంటే ఈనెల 29 వరకూ ఆగాల్సిందే.