చిరుకి లీకులు చేయడం మహా సరదా. ఆయన ఏదైనా పోగ్రాంకి వచ్చారంటే, కొత్త సినిమాకి సంబంధించిన లీకేదో చేసేస్తుంటారు. దానికి ఫ్యాన్స్ ముద్దుగా `మెగా లీక్` అనే పేరు పెట్టుకుంటారు.చిత్ర బృందం ప్రకటించకుండానే `ఆచార్య` అనే టైటిల్ ని లీక్ చేసింది చిరునే. ఇప్పుడు అలాంటి మరో మెగా లీక్ ఇది. సినిమా మొదలవ్వకుండానే.. అందులోని డైలాగ్ ని లీక్ చేసేశారు. అదే.. `భవదీయుడు భగత్ సింగ్`.
పవన్ కల్యాణ్ - హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా `భవదీయుడు భగత్ సింగ్`. ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన కథ చిరుకి తెలుసు. అందుకో కొన్ని డైలాగులు కూడా వినిపించాడట. అందులో ఓ డైలాగ్ వదిలారు చిరు. `ఆచార్య` ప్రమోషన్లలో భాగంగా చిరు, చరణ్, కొరటాలతో హరీశ్ శంకర్ ఓ ఇంటర్వ్యూ చేశాడు. అది బాగా వైరల్ అవుతోంది. అందులో భాగంగా.. భవదీయుడు డైలాగ్ బయటకు వచ్చింది. `మొన్నహరీశ్ చెప్పిన డైలాగ్ నాకు బాగా నచ్చింది` అంటూ ఆ భవదీయుడులోని డైలాగ్ ని లీక్ చేసేశాడు చిరు.
పవన్ కల్యాణ్ వెంట లక్షలాది మంది స్టూడెంట్స్ నడిచి వస్తుంటే.. `వీడు నడిస్తే వెనుక లక్షమంది నడుస్తారు.. బహుశా అదే వీడి ధైర్యమేమో...` అని విలన్ అంటే, పక్కనున్నవాడు.. `కాదు సార్.. ఆ వెనుక లక్షమందికి వీడున్నాడన్నదే ధైర్యం` అనేది డైలాగ్. నిజంగా పవన్‌పై ఇలాంటి డైలాగులు బాగా వర్కవుట్ అవుతాయి. థియేటర్లో పేలతాయి కూడా.
అయితే ఈ డైలాగ్ కి కేజీఎఫ్‌లో అమ్మ చెప్పే డైలాగ్ కీ సారుప్యత కనిపిస్తోంది. కేజీఎఫ్ 1లో ఓ డైలాగ్ ఉంది. `నీ వెన్నంటి వేలమంది ఉన్నారన్న ధైర్యం నీకు ఉంటే.. నువ్వొక్కడివే గెలుస్తావ్.. అదే నువ్వు ముందున్నవన్న ధైర్యం నీ వెనుక ఉన్నవాళ్లకుంటే.. ఈ ప్రపంచాన్నే గెలుస్తావ్..` అనే డైలాగ్ కి ఇది షార్ట్ కట్, రిప్లికాలా అనిపిస్తోంది. మరి హరీశ్ ఏమంటాడో?