చిరంజీవి సినిమాల్లో ఫుల్ కామెడీ టచ్ ఉన్న సినిమా `చంటబ్బాయ్`. జంథ్యాల దర్శకత్వంలో చిరు నటించిన ఏకైక సినిమా అదే. అప్పట్లో అది ఫ్లాప్. కానీ.. ఇప్పుడు మాత్రం టీవీల్లో ఎప్పుడొచ్చినా మిస్ కాకుండా చూస్తుంటారు. ఈ సినిమాలో చిరు కామెడీ టైమింగ్.. న భూతో, న భవిష్యత్త్ అన్నట్టు సాగుతుంది. చిరుకి కూడా ఈ సినిమా అంటే ప్రత్యేకమైన అభిమానం. సాయిధరమ్ తేజ్ అయితే...`ఈ సినిమా ఎప్పటికైనా రీమేక్ చేస్తా` అంటుండేవాడు. రామ్ చరణ్‌కీ ఈ సినిమానే ఫేవరెట్. మొన్నామధ్య `చంటబ్బాయ్` రీమేక్ పై చర్చ సాగింది.
అయితే ఇప్పుడు ఈ టాపిక్ మళ్లీ వచ్చింది. `ఆచార్య` ఈంటర్వ్యూలలో భాగంగా హరీష్ శంకర్‌తో చిరు, చరణ్, కొరటాల స్పెషల్ చిట్ చాట్ చేశారు. అందులో భాగంగా.. `చంటబ్బాయ్ రీమేక్ చేస్తే హీరోగా ఎవరు బాగుంటారు` అనే ప్రశ్న వచ్చింది. దానికి చిరు సమాధానం ఇస్తూ.. బన్నీ పేరు చెప్పాడు. బన్నీ కామెడీ టైమింగ్ బాగుంటుందని, తనకు మిమిక్రీ సెన్స్ ఉందని కితాబు ఇచ్చాడు చిరు. సో.. భవిష్యత్తులో ఎప్పుడైనా చంటబ్బాయ్ రీమేక్ టాపిక్ వస్తే.. బన్నీ పేరు కూడా గుర్తు పెట్టుకోవాల్సిందే.