టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా ప్రతి చోట రీమేక్ సినిమాల జోరు కొనసాగుతోంది. దాదాపు అరడజను తెలుగు సినిమాలు హిందీలోకి రీమేక్ అవుతున్నాయి అంటేనే ప్రస్తుతం రీమేక్స్ సినిమాల జోరు ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ లిస్టులో ఉన్న ఒక సినిమా 'భీష్మ' రీమేక్. వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ - రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఫిబ్రవరిలో రిలీజై మంచి విజయం సాధించింది.
ఈ సినిమా హిందీ రీమేక్ కోసం ఓ ప్రముఖ బాలీవుడ్ నిర్మాత రైట్స్ తీసుకున్నారు. మొదట్లో ఈ రీమేక్ లో రణబీర్ కపూర్ ను హీరోగా అనుకున్నారట. అయితే రణబీర్ చేతిలో ఇప్పటికే చాలా ప్రాజెక్టులు ఉండడంతో ఈ రీమేక్ ఆలస్యమయ్యే అవకాశం ఉందని, మరో హీరో కోసం చూస్తున్నారట. ఇంతలో ఈ సినిమా రీమేక్ పట్ల మరో బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ఆసక్తి కనబరచడంతో అతనితోనే రీమేక్ చేయాలని నిర్మాతలు ఫిక్స్ అయ్యారట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు.
ఇదిలా ఉంటే రణవీర్ సింగ్ నటించిన తాజా చిత్రం '83' త్వరలోనే రిలీజ్ కానుంది. 1983 లో ఇండియన్ క్రికెట్ టీమ్ వరల్డ్ కప్ గెలిచిన ఎపిసోడ్ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో కపిల్ దేవ్ పాత్రలో రణవీర్ సింగ్ నటిస్తున్నారు. ఈ సినిమా మొదటగా ఓటీటీలో రిలీజ్ అవుతుందని, తర్వాత దీపావళికి థియేటర్లలో రిలీజ్ చేస్తారని సమాచారం.