2020 క్యాలెండర్‌ని కరోనా హరించుకుపోయింది. ఓటీటీలు ఉండబట్టి సరిపోయింది. లేదంటే... సినిమాలకూ మొహం వాచిపోయి ఉండేది. ఓ రకంగా.. కరోనా, లాక్ డౌన్ ల వల్ల ఓటీటీలు బాగా జోరందుకున్నాయి. ఆ తరవాత.. థియేటర్లు తెరచుకోవడంతో వాటి జోరు తగ్గింది. ఇప్పుడు మళ్లీ సెకండ్ వేవ్ వల్ల థియేటర్లు మూసేశారు. దాంతో ఓటీటీలు మరోసారి కళకళలాడబోతున్నాయి. కొత్త సినిమాలతో.. ప్రేక్షకులకు వినోదాన్ని పంచబోతున్నాయి.
థ్యాంక్యూ బ్రదర్. జగమే తంత్రం, సూపర్ మచ్చీ లాంటి తెలుగు సినిమాలు నేరుగా ఓటీటీలో విడుదల కాబోతున్నాయి. బాలీవుడ్ నుంచి `రాధే` లాంటి భారీ బడ్జెట్ సినిమాలు ఓటీటీలో కనిపించబోతున్నాయి. నారప్పని సైతం నేరుగా ఓటీటీలో విడుదల చేసే ఆలోచన ఉందని తెలుస్తోంది. దీనిపై చిత్రబృందం ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. ఇటీవలే విడుదలై... సూపర్ హిట్టయిన `వకీల్ సాబ్` ఓటీటీలో సందడి చేయబోతోంది. రంగ్ దే, సుల్తాన్ కూడా ఓటీటీ విడుదలకు రెడీ అయిపోయాయి.
కర్ణన్, పిజ్జా 3 లాంటి సినిమాలకూ ఇప్పుడు ఓటీటీనే వేదిక అయ్యింది. మే, జూన్‌లలో కనీసం 20 సినిమాలు ఓటీటీలో విడుదల అవ్వబోతున్నట్టు తెలుస్తోంది. కనీసం వారానికి రెండు సినిమాలైనా ఓటీటీలో చూసేయొచ్చు. ఈ రాబోయే రోజుల్లో విడుదలకు సిద్ధమైన చిన్న, మీడియం సైజు సినిమాలు ఇప్పుడు ఓటీటీలోకి వెళ్లిపోతున్నట్టు టాక్. సో... ఓటీటీ నిండా వినోదాలే అన్నమాట.