బ‌తికిపోయిన పెద్ద నిర్మాత‌లు

మరిన్ని వార్తలు

క‌రోనా ఎంత ప‌ని చేసింది. సినిమాల్ని ఆపేసింది. షూటింగుల‌కు పుల్‌స్టాప్ పెట్టింది. వినోదానికి కత్తెర వేసింది. మొత్తంగా చూస్తే నిర్మాత‌ల గుండెల్లో నేరుగా గున‌పాల్ని దించేసింది.

 

మ‌న‌కు తెలియ‌డం లేదు గానీ, నిర్మాత‌లంతా ఇప్పుడు నాలుగ్గోడ‌ల మ‌ధ్య బావురు మంటున్నారు. సినిమాలు ఆగిపోయాయి. ఫైనాన్షియ‌ర్ల ద‌గ్గ‌ర తీసుకొన్న అప్పుల‌కు వ‌డ్డీలు పిల్ల‌ల్ని పెడుతున్నాయి. అవి పులుల్లా మార‌తాయేమో అని వాళ్ల భ‌యం. అయితే విచిత్రం ఏమిటంటే.. క‌రోనా ధాటికి ఈసారీ చిన్న నిర్మాత‌లే బ‌లైపోవ‌డం.

 

అవును.... చిత్ర‌సీమ‌లో వంద సినిమాలు త‌యార‌వుతుంటే, అందులో 80 చిన్న‌వే. వాళ్లంతా పెట్టుబ‌డిలో స‌గం డ‌బ్బులు అప్పుగా తీసుకొస్తారు. సినిమా విడుద‌ల ఆల‌స్యం అవుతుంటే, ఆ అప్పుల‌కు వ‌డ్డీలు క‌ట్టాల్సిందే. ఆర్‌.ఆర్‌.ఆర్‌, ప‌వ‌న్ - క్రిష్ సినిమా త‌ప్ప ఏ పెద్ద సినిమా సెట్స్‌పై లేవు. ఉన్న‌వ‌ల్లా చిన్నా, మ‌ధ్య స్థాయి చిత్రాలే. అగ్ర నిర్మాణ సంస్థ‌ల సినిమాలేవీ ఇప్పుడు సెట్స్‌పై లేవు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ వీర‌ప్ప సెట్స్‌పై ఉంది. అది మిడిల్ బ‌డ్జెట్ చిత్ర‌మే. గీతా ఆర్ట్స్ తీస్తున్న సినిమాలన్నీ చిన్న చిత్రాలే. దిల్ రాజు నుంచి ఓ సినిమా వ‌స్తోంది. అదే వ‌కీల్ సాబ్‌. ఈ సినిమా దాదాపుగా పూర్త‌యిపోయింది. ఏమాత్రం అవ‌కాశం దొరికినా మేలో విడుద‌ల చేసేస్తారు. కాబ‌ట్టి దిల్ రాజుకీ ఎలాంటి స‌మ‌స్యా లేక‌పోవొచ్చు. పైగా ఆయ‌న ఫైనాన్స్ తీసుకొచ్చి సినిమాలు చేసే టైపు కాదు. ఈ సినిమా మొద‌ల‌య్యేనాటికే అడ్వాన్సులు చేతికి వ‌చ్చి ఉంటాయి. ఇక స‌మ‌స్య‌ల్లా `ఆర్‌.ఆర్‌.ఆర్`తోనే. దాదాపు 300 కోట్ల సినిమా ఇది. ఒక్క రోజు షూటింగ్ ఆల‌స్య‌మైనా ఇబ్బందే.

 

ఏప్రిల్, మే నెల‌ల‌లో క‌నీసం 20 చిన్న సినిమాలు విడుద‌ల కావాల్సివుంది. ఆయా నిర్మాత‌లంతా ఇప్పుడు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. అన్నీ అనుకున్న‌ట్టు జ‌రిగితే ఈపాటికి సినిమాలు విడుద‌ల అయ్యేవి. త‌మ పెట్టుబ‌డి తిరిగొచ్చేది. ఇప్పుడు క‌రోనా పుణ్యాన సినిమాలన్నీ ఆగిపోయాయి. మ‌ళ్లీ చిన్న నిర్మాత‌ల‌కు మంచి  రోజులు ఎప్పుడు వ‌స్తాయో..?


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS