టీవీ రంగంపై కరోనా పడగ విప్పింది. మొన్నటికి మొన్న ప్రభాకర్ అనే నటుడికి కరోనా సోకింది. ఆ తరవాత నవ్యా స్వామికి కూడా కరోనా పాజిటీవ్ అని తేలింది. దాంతో బుల్లి తెర నటీనటులు ఆందోళనకు గురయ్యారు. నవ్య స్వామితో కలసి పనిచేసినవాళ్లందరికీ కోవిడ్ టెస్టులు నిర్వహిస్తే.. అందులో రవికృష్ణకు కరోనా పాజిటీవ్ అని తేలింది. బుల్లి తెరపై దాదాపుగా హీరో ఇమేజ్ ఉన్న నటుడు రవికృష్ణ. బిగ్ బాస్ లోనూ కనిపించాడు. తనని కరోనా పాజిటీవ్ అని తెలియడంతో ఆయన సన్నిహితులు, అభిమానులు నివ్వెర పోతున్నారు. తనకు కరోనా సోకిందన్న విషయాన్ని రవికృష్ణకూడా ట్విట్టర్ లో ప్రకటించాడు.
''నేను గత మూడు రోజులగా స్వీయ నిర్భంధంలోకి వెళ్లిపోయాను. మీ ఆశీర్వాదాలతో, దేవుని దయతో బాగానే వున్నాను. నాకు ఎలాంటి లక్షణాలు లేవు. నాకు ఇది ఎవరి ద్వారా సోకిందో దాని గురించి చింతించడం లేదు. నాతో కాంటాక్ట్ అయిన వారు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. లక్షణాలు వుంటే స్వీయ నిర్భంధంలోకి వెళ్లండి. వైరస్ సోకిన వారిని మరోలా చూడవద్దని, వారిని వివక్షతతో చూడవద్దని కొంత మందిని అభ్యర్థిస్తున్నాను. నేను మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా వుండనివ్వండి`'' అని ట్వీట్ చేశాడు.