నటుడు, సంగీత దర్శకుడు, గాయకుడు, నిర్మాత... ఇలా రఘు కుంచెలో చాలా కోణాలున్నాయి. ఈమధ్య నటుడిగా తన సత్తా చూపిస్తున్నారాయన. 'పలాస'లో షావుకారుగా రఘు నటన ప్రశంసలు అందుకుంది. అప్పటినుంచి ఆయనకు అవకాశాలు దండిగా వస్తున్నాయి. తాజాగా.. మరో సినిమా ఒప్పుకున్నారు.
గోగో మూవీస్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. ఇదో పిరియాడికల్ డ్రామా. 29 సంవత్సరాలుగా జైలు జీవితాన్ని అనుభవిస్తున్న ఓ మహిళ కథ. ఆమె భర్త మురుగన్ గా రఘు కుంచె కీలక పాత్ర పోషిస్తున్నారు. ''మహా విస్పోటనం వెనుక ఉన్న అందమైన ప్రేమకథ ఇది. రఘు కుంచె పాత్ర ఆకట్టుకుంటుంది. అన్ని రకాల భావోద్వేగాలూ ఈ కథలో ఉన్నాయ''ని చిత్ర బృందం తెలిపింది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మహేంద్ర కొక్కిరగడ్డ దర్శకుడు. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.