'బిగ్‌బాస్'లో ఎలిమినేషన్ ఘట్టం అత్యంత కీలకమైన ఘట్టం. వీకెండ్ వచ్చేసరికి హోస్ట్‌లు చేసే సందడితో పాటు, ఎవరు ఎలిమినేట్ అవుతారా? అనే ఆసక్తి వీక్షకుల్లో ఉండేది. ఈ సస్పెన్స్ తొలి రెండు సీజన్స్‌లో మాత్రమే కొనసాగింది. కానీ, మూడో సీజన్‌కొచ్చేసరికి ఎలిమినేషన్ ఘట్టంలో అంతగా పస ఉండట్లేదు. కారణం, హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యేదెవరో నెట్టింట్లో ముందుగానే లీక్ అయిపోతోంది. ఐదు ఎలిమినేషన్లు అలాగే జరిగాయి. ఐదో ఎలిమినేషన్‌గా ఆషూరెడ్డిని ఇంటి నుండి బయటికి పంపించారు.
అషూనే బయటికి వచ్చేది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగింది. అంతకు ముందు కూడా అలాగే జరిగింది. అయితే, ఈ సారి ఈ లీకుల్ని దృష్టిలో పెట్టుకుని, లాస్ట్ మినిట్‌లో బిగ్‌బాస్ టీమ్ ఏదైనా ఆసక్తికరమైన నిర్ణయాలు తీసుకుంటారేమో అనుకున్నారు. కానీ, అలా జరగలేదు. ప్రచారంలో ఉన్నట్లే ఆషూ రెడ్డిని ఎలిమినేట్ చేశారు. దాంతో, ఎలిమినేషన్ కోసం వీకెండ్ షోని వీక్షించాల్సిన అవసరం లేదనే అభిప్రాయానికి వచ్చేశారు బిగ్‌బాస్ ప్రేమికులు.
ఇక హోస్టింగ్ విషయానికి వస్తే, ఇది మూడో సీజన్ కావడం, మూడు సీజన్స్‌కీ ముగ్గురు హోస్ట్‌లుగా వ్యవహరించడంతో, కంపేరిజన్ ఖచ్చితంగా ఉంటుంది. అలా మొదటి ఇద్దరు హోస్ట్‌లు ఎన్టీఆర్, నానితో నాగార్జునను పోల్చి చూస్తున్నారు. వీకెండ్ షోస్‌ని ఎంటర్‌టైనింగ్‌గా, వీక్షకుల్ని మెప్పించే విధంగా నడపడంలో నాగార్జున ఫెయిలవుతున్నాడన్న ప్రచారం కూడా ఉంది. మరి, ఈ లోటును నాగార్జున ఫుల్ ఫిల్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. అలాగే, ఎలిమినేషన్ లీకేజీ విషయంలోనూ బిగ్‌బాస్ టీమ్ ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.