ఈ నెల 30న 'సాహో` విడుదల అవుతోంది. అందరి చూపూ ఆ సినిమాపైనే. సాహోకి పోటీగా సినిమాల్ని వదలడానికి చిత్ర నిర్మాతలు చాలా భయపడుతున్నారు. సాహో విడుదలకు వారం ముందు.. సినిమాని విడుదల చేయడం కూడా రిస్కే అనుకుంటున్న తరుణంలో.. `కౌసల్య కృష్ణమూర్తి` వచ్చింది. మరి ఈ సినిమా ఎలా వుంది? వసూళ్ల మాటేంటి? తమిళంలో విజయవంతమైన చిత్రం `కణ`.
అక్కడిస్టార్ హీరోల్లో ఒకడిగా చలామణీ అవుతున్న శివ కార్తికేయన్ నిర్మాతగా మారి తీసిన సినిమా ఇది. వసూళ్లు బాగా వచ్చాయి. విమర్శకుల ప్రశంసల్నీ అందుకుంది. అవార్డులూ వరుస కట్టాయి. అందుకే ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి నిర్మాత కె.ఎస్,రామారావు ఆసక్తి చూపించారు. రీమేక్‌ల స్పెషలిస్టు భీమనేని శ్రీనివాసరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అక్కడి కణ.. ఇక్కడ `కౌసల్య కృష్ణమూర్తి` పేరుతో రీమేక్ అయ్యింది. కణలోని ఎమోషన్స్‌ని తెలుగులోనూ తీసుకురావడంలో చిత్రబృందం సఫలీకృతమైంది. క్రికెట్‌నీ, రైతు సమస్యల్నీ ముడిపెట్టిన విధానం ఆకట్టుకుంది.
ఐశ్వర్యరాజేష్, రాజేంద్ర ప్రసాద్, ఝాన్సీల నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా మారింది. పతాక సన్నివేశాల్లో డైలాగులు ఆలోచింపజేస్తాయి. అయితే.. ద్వితీయార్థం మొత్తం తమిళ సినిమాని కట్, కాపీ, పేస్ట్ చేశారు. శివకార్తికేయన్ నటించిన సీన్లన్ని తెలుగులో యాధావిధిగా వాడుకున్నారు. దాంతో డబ్బింగ్ సినిమా చూస్తున్న భావన కలుగుతుంది. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఈ సినిమాకి వసూళ్లు మరీ మందకొడిగా ఉన్నాయి. సాహో ప్రభావం, పబ్లిసిటీ వైఫల్యంతో.. వసూళ్లు దారుణంగా పడిపోయాయి.
మంచిసినిమా తీసినా - జనం రావడం లేదని.. నిర్మాత కె.ఎస్.రామారావు సైతం నిరుత్సాహానికి గురవ్వడం పరిస్థితికి అద్దం పట్టింది. కౌసల్య కృష్ణమూర్తితో సహా ఈ వారం చాలా చిన్న సినిమాలు విడుదలయ్యాయి. అయితే... వాటి గురించి జనానికి సైతం తెలీలేదు. ఒక్కో సినిమాకీ పదో, పదిహేనో థియేటర్లు దొరికాయి. అయితే ఆ థియేటర్లన్నీ ఖాళీ. దాన్ని బట్టి - సినిమాల పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఈనెల 30న సాహో వచ్చేస్తోంది. మళ్లీ రికార్డుల గురించీ, వంద కోట్ల గురించీ మాట్లాడుకోవాలంటే అప్పటి వరకూ ఆగాల్సిందే.