బిగ్‌బాస్ తెలుగు నాలుగో సీజన్ విషయంలో చాలా హంగామా నడిచింది.. కానీ, అదంతా పెయిడ్ హంగామానే అని తేలిపోయింది. టైటిల్ విన్నర్ ఎవరన్న సస్పెన్స్ లేకుండానే ముందే అంతా లీక్ అయిపోయింది. కాగా, విన్నర్ అబిజీత్ కంటే, మూడో ప్లేస్ దక్కించుకున్న సోహెల్ కొంత హంగామా చేస్తున్నాడు సీజన్ ముగిశాక. సోహెల్ హీరోగా ఓ సినిమా ఇప్పటికే ప్రకటితమయ్యింది. ఇంకోపక్క సోహెల్ చుట్టూ రాజకీయ నాయకులూ చక్కర్లు కొడుతున్నారట.
సింగరేణి ముద్దుబిడ్డ సోహెల్.. అని ప్రచారం బిగ్ బాస్ సమయంలో ఎందుకు జరిగిందో, నిర్వాహకులు కూడా ఎందుకు అంత హంగామా చేశారో ఇప్పుడిప్పుడే అందరికీ అర్థమవుతోంది. సోహెల్ ద్వారా రాజకీయ లబ్ది పొందేందుకు కొందరు నాయకులు ప్రయత్నిస్తున్నారట. సింగరేణి ఓట్ల కోసం సోహెల్‌కి అదనపు పబ్లసిటీ ఇస్తున్నారు సదరు రాజకీయ నాయకులు. ఇటీవల సోహెల్, ఓ రాజకీయ నాయకురాలితో సమావేశమవడం రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.
అయితే, అదంతా మర్యాదపూర్వక భేటీ తప్ప, ఇందులో రాజకీయం ఏమీ లేదని సోహెల్ అభిమానులు అంటున్నారు. సినీ గ్లామర్‌ని రాజకీయ నాయకులు ఎలాగైతే ఉపయోగించుకుంటారో, బిగ్ బాస్ గ్లామర్‌ని కూడా రాజకీయ నాయకులు అలాగే వాడుకుంటున్నారు, ఇకపై కూడా వాడుకుంటారు. రాజకీయ కారణాలతోనే సోహెల్‌ని టాప్ 3 వరకు నిర్వాహకులు తీసుకొచ్చారంటూ ఇంకో ప్రచారం ఇప్పుడు మరింతగా జరుగుతుండడం ఆశ్చర్యకర పరిణామం.