బిగ్ బాస్ 4 అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యింది. ఎప్పటిలానే.. మంచి రేటింగులతోనే ఈ రియాలిటీ షో మొదలైంది. కానీ.. సెలబ్రెటీలని చూసి ప్రేక్షకులు షాకయ్యారు. సెలబ్రెటీ స్థాయికి తగిన వాళ్లెవరూ కంటెస్టెంట్లుగా లేకపోవడంతో అంతా పెదవి విరిచారు. ఒకరిద్దరు తప్ప, పాపులర్ ఫిగర్లెవరూ లేరు. దాంతో.. ఈ షో క్రమంగా చప్పబడిపోయింది. అయితే.. ఉన్నంతలో గంగవ్వపైనే అందరి ఫోకస్. ఈ వయసులో ఆమె బిగ్ బాస్ షోలోకి రావడం అందరినీ ఆశ్చర్యం, ఆనందంలో ముంచెత్తింది. ఎలాగైనా గంగవ్వని గెలిపిద్దామని ఫిక్సయ్యారు చాలామంది. గంగవ్వ ఉండడమే తమ షోకి ప్లస్ అని బిగ్ బాస్ నిర్వాహకులు భావించారు.
కానీ... ఇప్పుడు గంగవ్వే ఈ షోకి మైనస్ కాబోతోంది. బిగ్ బాస్ హౌస్ లో తాను ఇమడలేకపోతోందని, తనని ఇంటికి పంపించేయమని బోరుమంది గంగవ్వ. తాను ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడలేకపోతోందని గంగవ్వని చూస్తే అర్థమైపోతోంది. తనకు తానే ఈ షోలోంచి బయటకు రావాలనుకుంటోంది. తనని పంపించేయమని బిగ్ బాస్‌కీ, నాగార్జునకీ చెప్పి బాధ పడుతోంది గంగవ్వ. దాంతో గంగవ్వ సపోర్టర్లు కూడా డీలా పడిపోయారు. తాము గంగవ్వని గెలిపిద్దాం అనుకుంటే, గంగవ్వ ఈ షోలోంచి బయటకు రావాలనుకోవడంతో.. నిరుత్సాహ పడుతున్నారు. దాంతో పాటు ఈ షో నిర్వహణ తీరుపైనా విమర్శలు గుప్పిస్తున్నారు.
కేవలం రేటింగుల కోసమే గంగవ్వలాంటి వాళ్లని ఇబ్బంది పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. గంగవ్వ బయటకు వచ్చేస్తే ఈ షో మరింత కళ తప్పడం ఖాయం. అలాగని గంగవ్వని షోలోనూ ఉంచలేరు. దాంతో.. బిగ్ బాస్ యాజమాన్యం ఇబ్బందుల్లో పడినట్టైంది.