టాలీవుడ్ లో విపత్కర పరిస్థితి ఎదురైంది. సినిమాలు బాగానే రిలీజ్ అవుతున్నా - జనాలు థియేటర్లకు రావడం లేదు. అసలు ప్రేక్షకులకు థియేటర్లకు వచ్చి, సినిమాలు చూసే ఆసక్తి ఉందా, లేదా? అనేది అర్థం కావడం లేదు. వారానికి ఒక సినిమా వస్తేనే... జనం పెద్దగా స్పందించడం లేదు. ఒకేసారి మూడు సినిమాలొస్తే... థియేటర్ల పరిస్థితేంటి? జనాలు వస్తారా? థియేటర్లు నిండుతాయా.? అనేది ఇంకో పెద్ద ప్రశ్న. మంది ఎక్కువైన కొద్దీ.. మజ్జిగ పలచబడుతుందని సామెత. సినిమాలెక్కువ అయ్యే కొద్దీ... థియేటర్లు ఫుల్ అవ్వడం కష్టం. కానీ టాలీవుడ్ నిర్మాతలు ఇవేం ఆలోచించడం లేదు. పోటా పోటీగా సినిమాలు విడుదల చేస్తున్నారు. ఆగస్టు 5న ఒకేసారి మూడు సినిమాలొస్తున్నాయి. బింబిసార, కార్తికేయ 2, సీతారామం విడుదలకు సిద్ధమయ్యాయి.
మూడూ... క్రేజీ సినిమాలే. భారీ బడ్జెట్ చిత్రాలే. మూడింటి బడ్జెట్ దాదాపు రూ.100 కోట్ల వరకూ ఉంటుంది. కాకపోతే.. మూడూ మీడియం రేంజు హీరోల సినిమాలే. ఎగబడి మరీ ఫస్ట్ డే, ఫస్ట్ షో చూసేయాలన్నంత ఉత్సాహం ఏమీ ఉండదు. సినిమా బాగుంటే వెళ్తారంతే. అలాంటప్పుడు మూడు సినిమాలూ పోటా పోటీగా విడుదల చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పైగా ఇప్పుడు టాలీవుడ్ పరిస్థితి బాలేదు.
ప్రేక్షకుల మూడ్ సరిగా అంచనా వేయలేకపోతున్నారు. అలాంటప్పుడు ఒకే రోజు మూడొస్తే.. ఇబ్బందే. అందుకే దిల్ రాజు రంగంలోకి దిగి.. ఒక సినిమాని ముందుకో, వెనక్కో నెట్టడానికి ప్రయత్నించినట్టు సమాచారం. కానీ ముగ్గురు నిర్మాతలూ పట్టుదలతో ఉండడంతో... మూడు సినిమాలూ రిలీజ్ కి సై అంటున్నాయి. అంటే ఆగస్టు 5న థియేటర్ల దగ్గర ముక్కోణపు పోటీ తప్పదన్నమాట.