రాష్ట్రపతి కోటా నుంచి రాజ్యసభ పంపకాలు అయిపోయాయి. అందులో ఇద్దరు సినీ ప్రముఖులకు చోటు ఉండడం... ఆహ్వానించదగిన పరిణామమే. ముఖ్యంగా ఇళయరాజాకు రాజ్యసభ అనేది ఊహించిన విషయమే. ఎందుకంటే.. ఆయన ఇటీవల మోదీనీ, ఆయన ప్రభుత్వాన్నీ కీర్తిస్తూ... మాట్లాడేశారు. రాజకీయాల గురించీ, వ్యవస్థ గురించీ, ఇక్కడి లోపాల గురించీ ఎప్పుడూ మాట్లాడని ఇళయరాజా... అలా మాట్లాడేసరికి.. అంతా ఆశ్చర్యపోయారు. అక్కడే అర్థమైపోయింది. బీజేపీ కంట్లో ఇళయరాజా పడిపోయారని. ఇప్పుడు అధికారికంగా ప్రకటన వచ్చింది.
మేధావులకు, కళకారులకూ ప్రజా ప్రాతినిథ్యం వహించే అవకాశం ఇవ్వాలన్నది రాజ్యంగ నియమం. అందులో భాగంగానే రాజ్యసభకు పంపి గౌరవిస్తుంటారు. కాకపోతే.. ఇప్పుడు ఈ తతంగం `తాయిలాల పంపకం`లా మారిపోయింది. ఇళయరాజా.. ఓ సంగీత జ్ఞాని. సంగీతంలో ఆయన అందుకోని శిఖరం లేదు. ఆయన చూడని విజయం లేదు. ఆయన ముందు `రాజ్యసభ` నిజంగా చిన్న విషయమే. ఎనభై ఏళ్ల వయసులో ఆయన రాజ్యసభని కోరుకున్నారంటే, ఇంకా ఏదో నిరూపించుకోవాలని తహతహలాడుతున్నారంటే ఆశ్చర్యం వేస్తోంది. ఇప్పుడు ఎంతకాదన్నా.. ఆయనపై బీజేపీ ముద్ర పడిపోతుంది. దాన్ని ఆయన ఎప్పటికీ చెరుపుకోలేరు. ఎనభై ఏళ్ల వయసులో ఆయనకుఇలాంటి ముద్ర అవసరమా?
విజయేంద్ర ప్రసాద్‌కు రాజ్యసభ అనగానే ఇంకొంత ఆశ్చర్యం వేస్తుంది. ఆయన కమర్షియల్ రైటర్. చాలా సూపర్ హిట్లలో ఆయన పాత్ర ఉంది. ముఖ్యంగా బాహుబలి సిరీస్‌లో. అంతకు మించి విజయేంద్రప్రసాద్ ఎవరు? రాజమౌళి సినిమాలన్నింటికీ ఆయన కథలు అందించారు సరే. భజరంగీ భాయ్ జాన్ మినహాయించి, ఆయన బయట చిత్రాలకు కథ ఇవ్వడం, అవి విజయాలు అందుకోవడం చూసి చాలా కాలమైంది. రాజమౌళి విజన్ తోనే.. విజయేంద్ర ప్రసాద్‌కి పేరొచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓ రచయితనే రాజ్య సభకు పంపాలంటే.. దేశవ్యాప్తంగా అందుకు కొదవలేదు. ఆ మాటకొస్తే సత్యానంద్, పరుచూరి బ్రదర్స్ లాంటి వాళ్లు రచయితలుగా విజయేంద్ర ప్రసాద్ కంటే ఎక్కువ సేవలు చేశారు. విజయేంద్ర ప్రసాద్ కి రాజ్యసభ ఇవ్వడంలో కేంద్రం తొందరపడిందేమో అనిపిస్తుంది. నిజానికి.. రాజమౌళి కుటుంబం అంటే బీజేపీకి ముందునుంచీ వల్లమాలిన అభిమానం. రాజమౌళికి `పద్మశ్రీ` ప్రకటించడంలోనూ ఇలానే తొందరపడింది. రాజమౌళి సీనియర్లు, ఆయన గురువు, వంద సినిమాలు తీసి, కమర్షియల్ సినిమాకు కేరాఫ్ అడ్రస్స్ గా నిలిచిన కె.రాఘవేంద్రరావు ని కూడా పక్కన పెట్టి రాజమౌళిని పద్మశ్రీ చేసేశారు. రాజమౌళి అందుకు అర్హుడు కాదన్నది ఇక్కడ పాయింట్ కాదు. నిజంగా రాజమౌళి ప్రతిభావంతుడు. అర్హుడు. కానీ... ఆయనకు ఇంకా చాలా టైమ్ ఉంది. ఇప్పుడు విజయేంద్ర ప్రసాద్ విషయంలోనూ అలానే... తొందరపడింది బీజేపీ ప్రభుత్వం.