తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ని తమ వైపుకు లాక్కోవాలని బీజేపీ ఎప్పటి నుంచో విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. తాజాగా.. ఆయనకు మరో వల విసిరింది. గవర్నర్ పదవి ఇస్తానంటూ.. రజనీని బుట్టలో వేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. రెండేళ్ల క్రితం ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టడానికి రజనీ సమాయాత్తం అయినప్పుడు ఆయన్ని తమ పార్టీలోకి తీసుకోవాలని బీజేపీ భావించింది. అయితే.. రజనీ రాజకీయ ప్రవేశం.. ఆగిపోయింది. తాను రాజకీయాల్లోకి రానని రజనీ స్పష్టం చేశారు. ఆ తరవాత కూడా బీజేపీ తన ప్రయత్నాలు ఆపలేదు. ఏదోలా.. బీజేపీ జెండా కప్పడానికే ప్రయత్నించాయి. ఇప్పుడు గవర్నర్ తాయిలం చూపిస్తోంది బీజేపీ.
ఇటీవల రజనీకాంత్ అమీత్ షాతో భేటీ వేసినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా గవర్నర్ ప్రస్తావన వచ్చినట్టు టాక్. రజనీ కూడా అందుకు సానుకూలంగానే స్పందించారని తెలుస్తోంది. దక్షిణాదిన ఓ కీలకమైన రాష్ట్రానికి రజనీని గవర్నర్‌గా నియమించే ఛాన్స్ ఉందని తమిళనాట ప్రచారం జరుగుతోంది. రాజకీయాల్లోకి రాను - రాను అని చెప్పిన రజనీకాంత్ గవర్నర్ పదవి అందుకోవాలని చూస్తే మాత్రం... ఫ్యాన్స్ హర్టయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈనాడు గవర్నర్, రాష్ట్రపతి పదవులు కూడా రాజకీయాలకు అతీతం ఏమీ కాదు. అవి కూడా రాజకీయ పరమైన పోస్టులైపోయాయి.
రజనీని అడ్డం పెట్టుకుని తమిళనాట చక్రం తిప్పాలని బీజేపీ భావిస్తోంది. అందుకే గవర్నర్ పోస్టంటూ... రజనీని ఆకర్షిస్తోంది. దీనికి రజనీ లొంగుతాడా, లేదా? లొంగితే తమిళనాట రజనీ అభిమానులు బీజేపీకి ఫేవర్ గా పనిచేస్తారా? అనేది పెద్ద ప్రశ్న.