ఈరోజుల్లో ఓ అగ్ర హీరో సినిమా డిజాస్టర్ అయితే నిర్మాత కుప్పకూలిపోవడం ఖాయం. ఆ సినిమా కొన్న బయ్యర్లు కూడా రోడ్డు మీద పడతారు. ఈమధ్యే టాలీవుడ్ లో ఇలాంటి సంగతులు చాలా విన్నాం.. చూశాం. అయితే ఓ సినిమా విడుదలై.. అట్టర్ ఫ్లాప్ అయినా కూడా ఎలాంటి నష్టాలూ రాలేదట. ఈ ఫీట్ అమీర్ ఖాన్ 'లాల్ సింగ్ చడ్డా' సాధించింది.
అమీర్ ఖాన్ కథానాయకుడిగా నటించిన చిత్రం లాల్ సింగ్ చడ్డా. ఇటీవల ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై.. దారుణంగా బోల్తా పడింది. తొలి మూడు రోజులకు కనీసం రూ.30 కోట్ల వసూళ్లు కూడా రాలేదు. అమీర్ ఖాన్ సినిమా ఎంత ఫ్లాప్ అయినా, తొలి మూడు రోజుల్లో భీకరమైన వసూళ్లు సాధిస్తుంది. కానీ.. ఈ సినిమా పూర్తిగా రివర్స్. దక్షిణాదిలో ఈ సినిమాని అస్సలు పట్టించుకోలేదు.
బాలీవుడ్ లోనూ రిక్త హస్తాలే మిగిలాయి. ఈ సినిమా డిజాస్టర్ అని ట్రేడ్ వర్గాలు చెప్పేశాయి. అయితే ఈ సినిమా కొన్న కొంతమంది బయ్యర్లు రోడ్డున పడ్డారని, ఇప్పుడు 'లాల్ సింగ్' నిర్మించిన వయాకామ్ 18 ఆఫీసులో ఈ బయ్యర్లంతా గొడవకు దిగారని వార్తలొచ్చాయి. వీటిపై వయాకామ్ స్పష్టత ఇచ్చింది. ఈ సినిమాని దేశ వ్యాప్తంగా సొంతంగా విడుదల చేశామని, కాబట్టి.. ఎవరూ నష్టపోయే ఛాన్సే లేదని, పైగా నాన్ థియేటరికల్ రైట్స్, ఓవర్సీస్ రైట్స్ రూపంలో తమ సొమ్ములు తిరిగి వచ్చాయని, నిర్మాణ పరంగానూ నష్టాలు లేవని తేల్చి చెప్పింది. అంతే కాదు. ఈ సినిమాపై ఎవరో కావాలనే తప్పుడు ప్రచారం సృష్టిస్తున్నారని, వాళ్లపై కఠినంగా చర్యలు తీసుకొంటామని వయాకామ్ హెచ్చరించింది. అమీర్ సినిమాకి దాదాపుగా రూ.200 కోట్లు ఖర్చయిందని ఓ టాక్. కానీ తెరపై చూస్తే.. ఇది 200 కోట్ల సినిమాగానే కనిపించలేదు. అమీర్ పారితోషికం తీసుకోకుండా ఈ సినిమాలో వాటా అందుకొన్నాడు. కాబట్టి ఈ సినిమాకి రూ.200 కోట్లు అయ్యే ఛాన్సే లేదు.