ఏపీలో బలోపేతమవ్వాలని బీజేపీ ఎప్పటి నుంచో అనుకుంటోంది. అందుకు వాళ్లకో ప్రజాకర్షణ కలిగిన నేత కావాలి. అందుకే వాళ్ల దృష్టి చిరంజీవిపై పడింది. ప్రజారాజ్యం స్థాపించాక.. 18సీట్లు గెలుచుకొన్నాక.. అనుకోని పరిస్థితుల్లో పార్టీని.. కాంగ్రెస్‌లో విలీనం చేయాల్సివచ్చింది. ఆ తరవాత.. చిరుకి మంత్రి పదవి కూడా వచ్చింది. పదవీకాలం పూర్తయ్యాక... రాజకీయాలకు అంటీముట్టనట్టు ఉన్నారు చిరు. ఆయన ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనూ లేనట్టే. అందుకే బీజేపీ తన వైపుకు తిప్పుకోవాలని చూస్తోంది. గత కొంతకాలంగా చిరుని ఆకర్షించే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడు మరోసారి... చిరుకి గాలం వేసింది.
జులై 4న ప్రధాని మోదీ భీమవరం వస్తున్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ప్రధాని.. అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గోనాలని చిరుకి ఆహ్వానం అందింది. దాంతో ఆపరేషన్ ఆకర్ష ప్రారంభమైందన్న ఊహాగానాలు మొదలైపోయాయి. ఈ కార్యక్రమానికి చిరుని ప్రత్యేకంగా ఆహ్వానించాల్సిన పనిలేదు.
కానీ.. పని గట్టుకొని చిరుని మాత్రమే పిలిచింది బీజేపీ వర్గం. దాంతో.. తెర వెనుక ఏదో నడుస్తోందన్న సంకేతాలు అందుతున్నాయి. ఇక్కడ మరో ట్విస్టు ఏమిటంటే... బీజేపీ స్నేహ హస్తం కోరుతున్న పవన్ కి మాత్రం ఆహ్వానం రాలేదు. ఏపీలో.. పవన్ జనాదరణ కూడా తెలిసిన బీజేపీ.. ఈ కార్యక్రమానికి పవన్‌ని ఎందుకు దూరం పెట్టిందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.