ఇటీవలే 'జై లవకుశ' సినిమాతో హిట్ అందుకున్న డైరెక్టర్ బాబీ. ఈ సినిమా తర్వాత బాబీ, రవితేజతో సినిమా చేయాలనుకున్నాడు. కానీ ఇప్పుడు అనూహ్యంగా ఆయన లిస్టులోకి మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ వచ్చాడనీ ఫిల్మ్ వర్గాల సమాచారమ్. త్వరలో బాబీ - తేజు కాంబినేషన్లో సినిమా సెట్స్ మీదికెళ్లనుందనీ తెలుస్తోంది. సాయి ధరమ్ తేజ్ తనకి వెరీ వెరీ స్పెషల్ అంటున్నాడు డైరెక్టర్ బాబీ. తేజు అంటే సహజంగా అందరికీ ఇష్టమే. కానీ బాబీకి మరింత ఇష్టమట. ఆ ఇష్టంతోనే తేజు కోసం ఓ సూపర్బ్ స్క్రిప్ట్‌ని రెడీ చేసి పెట్టాడట.
సాయి ధరమ్ తేజ్ నటించిన 'జవాన్' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. డిశంబర్ 1న 'జవాన్' విడుదల కానుంది. కాగా ప్రస్తుతం తేజు వినాయక్ దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. టాలీవుడ్‌కి మెగా మేనల్లుడిగా పరిచయమై, తొలి సినిమాతోనే పరాజయం చవి చూసిన తేజు, తర్వాతి సినిమాకి పుంజుకున్నాడు. అచ్చు మేనమామలను పోలిన రూపంతో హీరోగా ఒక్కో మెట్టు ఎక్కుతూ వస్తున్నాడు. మెగా ఫ్యామిలీకే కాదు, మెగా అభిమానులకు కూడా ముద్దుల మేనల్లుడయిపోయాడు తేజు. బి.వి.యస్ రవి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'జవాన్' సినిమాలో తేజు కొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు.
'జవాన్' - ఇంటికొక్కడు అనే క్యాప్షన్‌తో చాలా క్యాచీగా ఉంది టైటిల్. అలాగే మనింటి మేనల్లుడిగానే తేజు ఆదరణ పొందుతున్నాడు. కొన్ని ఫెయిల్యూర్స్ చూసినప్పటికీ, హీరోగా తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. 'సుప్రీమ్' సినిమాతో హిట్ కొట్టి సుప్రీమ్ స్టార్ అయిపోయాడు. వినాయక్ సినిమా కూడా పవర్ ఫుల్ సబ్జెక్ట్‌తోనే తెరకెక్కుతోంది. ఇవి కాక మనోడి చేతిలో ఇంకా పలు చిత్రాలున్నాయి. తాజాగా వచ్చి చేరిన బాబీ ప్రాజెక్టు కూడా ఓకే అయితే మనోడి ఫిల్మ్ డైరీ ఇప్పట్లో ఖాళీ లేనట్లే!