ప్రముఖ బాలీవుడ్ నటుడు రిషి కపూర్ కాస్సేపటి క్రితం తుది శ్వాస విడిచారు. ఒకప్పుడు ఆయన అమ్మాయిల కలల రాకుమారుడు. వయసు మీద పడ్తున్నా వన్నె తగ్గని అందం ఆయనది.. అంటూ అమ్మాయిలు ఆయన్ని అమితంగా అభిమానించేవారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న రిషి కపూర్, విదేశాల్లో వైద్య చికిత్స చేయించుకున్నారు. అయితే, క్యాన్సర్ మహమ్మారి నుంచి ఆయన పూర్తిగా బయటపడలేకపోయారు. శ్వాస కోశ సమస్యతో నిన్ననే ఆసుపత్రిలో చేరిన రిషి కపూర్, ఈ రోజు ఉదయం కన్ను మూసినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
బాలీవుడ్ ప్రముఖులు రిషి కపూర్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. నిన్ననే ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ క్యాన్సర్ కారణంగా కన్ను మూసిన విషయం విదితమే. రోజు వ్యవధిలోనే బాలీవుడ్ మరో లెజెండరీ నటుడ్ని కోల్పోవడం దురదృష్టకరం. బాలీవుడ్‌కి సంబంధించి రిషి కపూర్‌ని ఈ తరం ప్రముఖులు ‘పెద్ద తలకాయ’గా చెబుతారు. అందరితోనూ అత్యంత సన్నిహిత సంబంధాలున్న రిషి కపూర్‌ని, ఈ తరం నటీనటులు, నిన్నటితరం నటీనటులు తమ కుటుంబ సభ్యుడిగా భావిస్తారు. కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన రిషి కపూర్‌కి సౌత్ సినీ పరిశ్రమలోనూ పలువురితో సన్నిహిత సంబంధాలున్నాయి.