ఇది వరకు.. ఇండియన్ సినిమా అంటే... హిందీ సినిమానే అనుకొనేవారు. బాలీవుడ్ మినహాయిస్తే... దక్షిణాది సినిమాల్ని, ప్రాంతీయ సినిమాల్నీ ఎవరూ పట్టించుకొనేవారు కాదు. ముఖ్యంగా బయటి దేశాల వాళ్లు. వంద కోట్లు, రెండొందల కోట్ల లెక్కలన్నీ ఆ సినిమాలకే. అయితే ఇప్పుడు ఈ సమీకరణాలు మారాయి. ఇండియన్ సినిమా అంటే - తెలుగు సినిమానే అనే స్థాయికి మన సినిమా ఎదిగింది. మన సినిమాలు బాక్సాఫీసు దగ్గర వీర కుమ్ముడు కుమ్ముతున్నాయి. డబ్బింగ్ రూపంలో వెళ్లినా, బాలీవుడ్ నుంచి భారీ వసూళ్లు సాధిస్తున్నాయి. ఈ ఎదుగుదల చూసి బాలీవుడ్ ఇప్పుడు ఓర్వలేకపోతోంది. `ఆర్.ఆర్.ఆర్` సినిమా గురించి బాలీవుడ్ ప్రముఖులెవరూ ట్వీట్లు చేయకపోవడమే ఇందుకు నిదర్శనం.
బాహుబలి వచ్చినప్పుడు.. సాహో రాజమౌళి అంటూ బాలీవుడ్ అంతా కీర్తించింది. ఆ తరవాతి నుంచి తెలుగు సినిమాల హవా బాలీవుడ్ లో బాగా ఎక్కువైంది. పుష్ప బాలీవుడ్ లో మంచి వసూళ్లు సాధించింది. ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ అయితే కొత్త రికార్డులు సృష్టిస్తోంది. అయితే.. ఇవేం బాలీవుడ్ కంటికి కనిపించడం లేదు. ఈ సినిమా గురించి ఒక్క బాలీవుడ్ సెలబ్రెటీ కూడా ట్వీట్ చేయలేదు. అంతెందుకు? ఈ సినిమాకి పనిచేసిన అజయ్ దేవగణ్ కానీ, అలియా భట్ గానీ, ఈ సినిమాని ప్రస్తావిస్తూ ఇప్పటి వరకూ మాట్లాడలేదు. సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. ఇదంతా చూస్తుంటే.. తెలుగు సినిమా ఖ్యాతి చూసి బాలీవుడ్ కుళ్లుకుంటుందేమో అనిపిస్తోంది. హిందీ సినిమాలు అట్టర్ ఫ్లాప్ అవుతున్న తరుణంలో... తెలుగు సినిమాలు ఈస్థాయి వసూళ్లు అందుకోవడం చూసి బాలీవుడ్ జీర్ణించుకోలేకపోతోంది. అందుకే.. ఒక్కరి నుంచీ కూడా ట్వీట్ రాలేదు.