బాక్సాఫీసు దగ్గర ఆర్.ఆర్.ఆర్ దుమ్ము రేపుతోంది. మిక్డ్స్ రివ్యూలకు ఎదురొడ్డి... భారీ వసూళ్లు సాధిస్తోంది. శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి అనూహ్యమైన ఓపెనింగ్స్ వచ్చిన సంగతి తెలిసిందే. శని, ఆదివారాలు సైతం.. ఆర్.ఆర్.ఆర్ జోరు కొనసాగింది. తొలి మూడు రోజులకు ప్రపంచ వ్యాప్తంగా రూ.485 కోట్లు సాధించింది. ఇది సరికొత్త ఇండియన్ రికార్డ్. నార్త్ లో దాదాపుగా రూ.65 కోట్లు సాధించినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఏ ఏరియా నుంచి ఎంతొచ్చింది? అనే వివరాలు తెలియాల్సివుంది. చిత్రబృందం కూడా ఈ వసూళ్ల వివరాల్ని సవివరంగా ప్రకటించబోతోంది.
ఓ ఇండియన్ సినిమా.. తొలి మూడు రోజుల్లో ఇన్ని భారీ వసూళ్లుసాధించడం.. హాలీవుడ్ వర్గాల్ని సైతం ఆశ్చర్యపరుస్తోంది. అక్కడ కూడా `ఆర్.ఆర్.ఆర్` గురించి ప్రత్యేక కథనాలు రాస్తున్నారు. హాలీవుడ్ స్థాయిలో ఓ ఇండియన్ చిత్రానికి వసూళ్లు దక్కుతున్నాయని మన సినిమాని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అయితే సోమవారం నుంచి ఆర్.ఆర్.ఆర్ అసలు పరీక్షని ఎదుర్కోబోతోంది. ఎంత పెద్ద సినిమాకైనా తొలి మూడు రోజులే హవా. సోమవారం నుంచి వసూళ్లు భారీగా డ్రాప్ అవుతాయి. మరి.. ఆర్.ఆర్.ఆర్ విషయంలోనూ ఇదే జరుగుతుందా? లేదంటే.. ఈ వసూళ్ల ఉధృతిని కొనసాగిస్తుందా? చూడాలి మరి.