లాక్ డౌన్ తో చిత్రసీమ నెత్తిమీద పిడుగు పడినట్టైంది. విడుదలకు రెడీగా ఉన్న సినిమాలు ఆగిపోయాయి. లాక్ డౌన్ ఎత్తేశాకే ఆయా చిత్రాలు విడుదలకు నోచుకుంటాయి. అయితే ఈలోగా... ఓ టీ టీ లో విడుదల చేసుకోవడం ఒక్కటే నిర్మాతల ముందున్న ప్రత్యామ్నాయం. అయితే.. ఓటీటీలో విడుదల చేసుకుంటే, తమ సినిమాలకు ఆదరణ ఎలా ఉంటుందో అని నిర్మాతలు, హీరోలు భయపడుతున్నారు. పైగా ఓ టీ టీ లో అమ్ముకుంటే.. తమ బడ్జెట్లు పూర్తి స్థాయిలో తిరిగి రావు. ఒకట్రెండు తెలుగు సినిమాలు ఓ టీ టీ ద్వారా విడుదలైనా, అవి చిన్న సినిమాలే కావడంతో వాటిపై పెద్ద గా దృష్టి పడలేదు. ఆయా చిత్రాలు కూడా ఏమాత్రం ప్రభావితం చేయలేకపోయాయి. అయితే ఇప్పుడు ఓ టీ టీ వైపు బాలీవుడ్ వడి వడిగా అడుగులేస్తోంది. అక్షయ్ కుమార్ లక్ష్మీ బాంబ్ ఓటీటీ ద్వారా విడుదలకు సిద్ధమైంది. అమితాబ్ బచ్చన్ సినిమా `గులాబో సితావో` కూడా ఓ టీ టీకి అమ్మేశారు. జూన్ 12న అమేజాన్ ప్రైమ్ ద్వారా ఈసినిమా విడుదల కానుంది. విద్యాబాలన్ కొత్త సినిమా శకుంతల దేవి కూడా ఓటీటీకి అమ్ముడుపోయింది. దీంతో పాటు మరో అరడజను సినిమాలు ఓటీటీలో ప్రదర్శనకు సిద్ధమయ్యాయి. త్వరలోనే రిలీజ్‌డేట్లు ప్రకటిస్తారు. టాలీవుడ్ తో పోలిస్తే బాలీవుడ్ మార్కెట్ పెద్దది. విస్కృత స్థాయిలో ప్రేక్షకులు ఉన్నారు. కాబట్టి ఓ టీ టీ ద్వారా మంచి రేట్లే లభిస్తాయి. తెలుగు అలా కాదు. ప్రాంతీయ ప్రేక్షకులకే పరిమితం. అందుకు అనుకున్న స్థాయిలో రేట్లు రావు. అందుకే తెలుగు నిర్మాతలు ఆలోచిస్తున్నారు. బాలీవుడ్ వాళ్లే.. ఓటీటీకి సిద్ధమైతే, తెలుగు నిర్మాతలకు కొత్త భయాలెందుకు? త్వరలోనే కొన్ని తెలుగు సినిమాలూ ఓటీటీ వైపు మొగ్గు చూపడం ఖాయంగా కనిపిస్తోంది.