మెగాస్టార్‌ను కలిసిన ఆమిర్‌ఖాన్‌

By iQlikMovies - April 07, 2019 - 17:30 PM IST

మరిన్ని వార్తలు

జీవితంలో నిత్యం స్ఫూర్తి పంచేవారు కొందరుంటారు. అలాంటివారిని తరచూ కలవకపోయినా వారి మీద మనసులో గౌరవం మాత్రం ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటుంది. తాజాగా ఆమిర్‌ఖాన్‌కు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఆయన అత్యంత అభిమానించే నటుల్లో ఒకరు ఆయనకు తారసపడ్డారు. కనిపించడమే తరువాయిగా ఆమిర్‌ అతని దగ్గరకు పరుగులు తీశారు. ఇంతకీ ఆమిర్‌కి స్ఫూర్తిగా నిలిచిన ఆయన మరెవరో కాదు తెలుగువారికి అభిమాన మెగాస్టార్‌. 

 

అవును... మెగాస్టార్‌ చిరంజీవిని ఆమిర్‌ఖాన్‌ క్యోటో ఎయిర్‌పోర్టులో కలిశారు. ఈ విషయాన్ని ఆమిర్‌ఖాన్‌ ట్విట్టర్‌లో పంచుకున్నారు. ''నా అభిమాన నటుల్లో ఒకరు, సూపర్‌స్టార్‌ చిరంజీవిగారిని క్యోటో ఎయిర్‌పోర్టులో కలిశాను. చాలా గొప్ప సర్‌ప్రైజ్‌గా అనిపించింది. ఆయన తాజా ప్రాజెక్ట్‌ గురించి మాట్లాడుకున్నాం. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాథతో ఆయన సినిమా చేస్తున్నారని తెలుసుకున్నా. ఆయన ఎప్పుడూ మాకు స్ఫూర్తిని పంచుతూనే ఉంటారు. ఆయనకు ప్రేమతో'' అని ఆమిర్‌ఖాన్‌ ట్వీట్‌ చేశారు. 

 

చిరంజీవి మనసులోని మాటలను ఆయన తరఫున ఆయన తనయ సుశ్మిత కొణిదెల ట్వీట్‌ చేశారు. ''అద్భుతమైన, ప్రతిభావంతమైన నటుడు ఆమిర్‌ఖాన్‌ని కలవడం సర్‌ప్రైజ్‌గా అనిపించింది. ఆమిర్‌ సతీమణి కిరణ్‌రావు కూడా ఆయనతో ఉన్నారు. టోక్యో ఎయిర్‌పోర్టులో ఆ దంపతులను మా దంపతులం కలుసుకున్నాం. ప్రస్తుతం నేను హైదరాబాద్‌ ప్రయాణంలో ఉన్నా. త్వరలో నా 'సైరా' టీమ్‌తో చేరుతాను..'' అని చిరంజీవి చెప్పిన విషయాలను సుశ్మిత ట్వీట్‌లో పంచుకున్నారు. 

 

ఆమిర్‌ఖాన్‌ దంపతులతో కొణిదెల సురేఖ, చిరంజీవి కలిసి ఉన్న ఫొటోలను కూడా సుశ్మిత పంచుకోవడం విశేషం. ఇటీవల సతీమణి సురేఖతో కలిసి చిరంజీవి జపాన్‌ పర్యటనకు వెళ్లారు. తిరిగి వస్తుండగానే ఆమిర్‌ఖాన్‌ దంపతులను టోక్యో ఎయిర్‌పోర్టులో కలిశారు. త్వరలోనే 'సైరా' సెట్‌కు చేరుకుంటారు చిరంజీవి. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్‌ నిర్మిస్తున్న చిత్రం 'సైరా'. ఈ చిత్రానికి సుశ్మిత కొణిదెల కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పనిచేస్తున్న సంగతి తెలిసిందే. కొణిదెల సురేఖ ఆ చిత్రానికి సమర్పకురాలు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS