అఖండతో తన స్టామినా ఏపాటితో నిరూపించేశాడు బోయపాటి శ్రీను. మాస్, కమర్షియల్ సినిమాల్ని తీయడంలో తనని మించిన వాడు లేడన్న విషయాన్ని మరోసారి ఘనంగా చాటుకొన్నాడు. అఖండ తరవాత టాప్ హీరోలంతా బోయపాటి శ్రీనుతో సినిమాలు చేయడానికి క్యూ కట్టారు. అయితే... ఆ అవకాశం రామ్‌ని వరించింది. రామ్ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇంకా మొదలు కాలేదు. అప్పుడే కాక పెంచేస్తోంది. ఈ సినిమాకి దాదాపుగా రూ.100 కోట్ల బడ్జెట్ అవ్వబోతోందని టాక్. రామ్ పై ఇంత బడ్జెట్ పెట్టడం ఇదే తొలిసారి. అదంతా.. బోయపాటి శ్రీను మహిమే.
ఈ చిత్రం కోసం బాలీవుడ్ కథానాయికని బోయపాటి శ్రీను రంగంలోకి దించుతున్నాడని వార్తలొస్తున్నాయి. రామ్ సరసన పరిణితీ చోప్రాని కథానాయికగా ఎంచుకుంటారని అనుకుంటున్నారు. పరిణితీ వస్తే... ఈ సినిమాకి అమాంతం క్రేజ్ పెరిగిపోయినట్టే.
అంతే కాదు... విలన్‌గా తమిళ స్టార్‌ని తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నాడట. తమిళంలో స్టార్ హోదా అనుభవిస్తున్న శివ కార్తికేయన్ ని ఈ సినిమాలో విలన్ గా చూపించబోతున్నాడని టాక్. శివ కార్తికేయన్ హీరోగా తెలుగులో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విలన్‌గానూ ఎంట్రీ ఇస్తే... తెలుగులో తన కెరీర్‌కి హెల్ప్ అవుతుందని శివ కార్తికేయన్ భావిస్తే... రామ్, బోయపాటి, శివకార్తికేయన్ కాంబో సెట్టయితే.. ఈ సినిమా మరో స్థాయికి వెళ్లడం ఖాయం.