దర్శకులలో ఒకొక్కరిదీ ఒక్కో శైలి. కొంతమంది యాక్షన్‌సినిమాల్ని బాగా తీయగలరు. ఇంకొంతమంది ఫ్యామిలీ స్టోరీల్ని బాగా డీల్ చేస్తారు. మరికొంతమంది ఎంటర్ టైన్‌మెంట్స్ ని తెరకెక్కించడంలో దిట్ట. ఏం చేసినా ప్రేక్షకుడి నాడీని కనిపెట్టాల్సిందే. ఏ సన్నివేశానికి ఎలా రియాక్ట్ అవుతారో, ఎందుకు రియాక్ట్ అవుతారో తెలుసుకోవాల్సిందే. ఈ విషయంలో.. మాస్టర్ డిగ్రీ చేసేశాడు బోయపాటి శ్రీను. బోయపాటి సినిమాలో హీరో ఎప్పుడూ దుమ్ము లేపేస్తుంటాడు. తన దమ్ము చూపిస్తుంటాడు. `చూడూ ఒక వైపే చూడూ..` అంటూ అందరినీ తన వైపుకు లాగేసుకుంటుంటాడు. అదీ బోయపాటి మార్క్.
యాక్షన్ సినిమాలు ఇష్టపడేవాళ్లు, మాస్ ప్రేక్షకులు బోయపాటి టేకింగ్‌కీ, స్టైల్ కీ ఫిదా అయిపోతుంటారు. భద్రతో బోయపాటి శ్రీను ప్రయాణం ప్రారంభమైంది. ఆ సినిమాని విడుదలై ఈ రోజుకి సరిగ్గా పదిహేనేళ్లు. ముత్యాల సుబ్బయ్య దగ్గర శిష్యరికం చేశాడు బోయపాటి శ్రీను. పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం లాంటి చిత్రాలకు సహాయకుడిగా పనిచేశాడు. ఆ తరవాత దర్శకుడు కావాలన్న ఉద్దేశంతో కథలు పట్టుకుని హీరోల చుట్టూ తిరిగాడు. భద్ర కథ రాసుకుని ముందు అల్లు అర్జున్‌కి వినిపించాడు. బన్నీకి ఈ కథ బాగా నచ్చినా, తనకు ఈ కథ సూటవ్వదని అనిపించింది. బన్నీ బోయపాటి శ్రీనుని దిల్ రాజుకి పనిచయం చేయడం, ఆయనకీ ఈ కథ నచ్చడంతో - భద్ర సినిమా పట్టాలెక్కింది. ఆ హిట్టుతో బోయపాటి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది.
తులసి, సింహా, లెజెండ్, సరైనోడు.. ఇలా ఒకదాన్ని మించి మరో హిట్టు. ఎన్టీఆర్ తో తెరకెక్కించిన `దమ్ము` ఫ్లాప్ అయినా, వసూళ్లు మాత్రం బాగానే వచ్చాయి. ఇప్పుడు బాలయ్య కోసం ఓ కథ తయారు చేశాడు. లాక్ డౌన్ ఎత్తేసిన వెంటనే.. ఈ సినిమా మొదలైపోతుంది. చిరంజీవితో ఓ సినిమా చేయాలన్నది బోయపాటి కల. అది కూడా త్వరలోనే నెరవేరాలని ఆశిద్దాం.